- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిలాబాద్ జిల్లాలో టైగర్ టెన్షన్..!
పులుల సంచారంతో ఆదిలాబాద్ అడవుల్లో కంటిమీద కునుకు కరువైంది. ఆదిలాబాద్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద పులుల సంచారం తీవ్ర భయాందోళన రేపుతోంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తాడోబా అటవీ ప్రాంతాల నుంచి ‘మేటింగ్’ కోసం పులులు పెన్‌గంగా నది దాటి జిల్లాలోకి వస్తున్నాయి.

పులుల సంచారంతో ఆదిలాబాద్ అడవుల్లో కంటిమీద కునుకు కరువైంది. ఆదిలాబాద్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద పులుల సంచారం తీవ్ర భయాందోళన రేపుతోంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తాడోబా అటవీ ప్రాంతాల నుంచి ‘మేటింగ్’ కోసం పులులు పెన్‌గంగా నది దాటి జిల్లాలోకి వస్తున్నాయి. ప్రస్తుతం 4 పులులు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భీంపూర్, బోథ్, సొనాల మండలాల్లోని ప్రజలు భయంతో ఉన్నారు. అటవీ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోగా, రైతులు, కూలీలు పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. బోథ్ మండలంలోని రెండ్లపల్లిలో చిరుత దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి. ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆయా ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. పులుల కదలికలపై నిఘా ఉంచి, ప్రజలకు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారు.
దిశ, ఆదిలాబాద్ : జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలో మళ్లీ పులుల భయం పట్టుకుంది. ప్రతి ఏటా మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తాడోబా అటవీ ప్రాంతం నుంచి ‘మేటింగ్’ కోసం జిల్లా వైపు వస్తున్న పెద్ద పులులతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయందోళన చెందుతున్నారు. ఈ పులుల సంచారం అటవీ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. పెద్ద పులులు జనావాసాల్లోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, బోథ్, సొనాల, బేల మండలాల సరిహద్దు ప్రాంతాల్లో వీటి సంచారం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, అటవీశాఖ అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతాల్లో పులుల సంచారంపై నిఘా పెట్టారు. ఈ మేరకు ఆ ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ధైర్యాన్ని నింపుతూ పలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
మహారాష్ట్ర నుంచి మన జిల్లాలోకి..
మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకొని ఉంటాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం జిల్లాకు అతి సమీపంలోనే ఉంటుంది. అక్కడి అటవీ ప్రాంతంలో సుమారు 25నుంచి 30వరకు పెద్ద పులులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో 4పులులు తిరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఏటా వాటికి అనువైన అవాసం కోసం సరిహద్దులోని పెన్ గంగానది దాటి జిల్లాలోకి ప్రవేశిస్తుంటాయి. కాగా, అవి అక్టోబర్ నుంచి జనవరి వరకు ‘మేటింగ్’ కోసం 3నెలల పాటు ఆదిలాబాద్ జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో సంచరించి తిరిగి వెళ్లిపోతాయి. ఇలా వివిధ ప్రాంతాల్లో నదిని దాటి జిల్లాలోకి ప్రవేశించగానే ఇక్కడ కూడా విశాలమైన అటవీ ప్రాంతాలు ఉండడంతో వాటి గుండా వివిధ ప్రాంతాల్లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
పులి సంచారంతో భయం..
ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలోని తాంసి(కే) శివారులోని పంట పొలంలో కూలీలకు పులి కనిపించడంతో స్థానికులు భయంతో ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఆయా ప్రాంతాలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు పులి అడుగులను గుర్తించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. గత వారం రోజులుగా పులి సంచారం కారణంగా పంట పొలాలకు వెళ్లేందుకు కూలీలు, రైతులు జంకుతున్నారు. కాగా, ఇటీవల బోథ్ అటవీ శాఖ రేంజ్ పరిధిలోనూ పెద్దపులి సంచరిస్తోందని అటవీ ప్రాంతం వైపు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. పెద్ద పులులతోపాటు చిరుతల సంచారం జిల్లాలో కలకలం రేపుతోంది.
పులుల దాడి ఘటనలు..
అడవుల్లో ఉంటూ సమీప పంట పొలాల్లోకి మేతకు వెళ్లే పశువులపై పులులు దాడి చేస్తున్నాయి. ఇక చిరుత పులుల సంచారం అధికంగా ఉంది. జిల్లాలో చిరుతలు పశువులపై తరుచూ దాడులు చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జిల్లాలోని భీంపూర్ మండలంలోని తాంసి (కే), గుంజాల గ్రామ శివారు ప్రాంతాల్లో పులి స్థానికులకు కనిపించింది. కాగా ఈ నెలలో బోథ్ మండలంలోని రెండ్లపల్లి గ్రామ సరిహద్దు నిగిని అటవీ ప్రాంతంలో చిరుత పులి రెండు ఆవులపై దాడి చేయడంతో మృతి చెందాయి. తాజాగా సోనాల మండలంలో స్థానికులకు పులి కనిపించినట్లు అటవీశాఖ అధికారులకు తెలిపారు. గత జూన్ నెలలో కూడా బోథ్ మండలంలోని రఘునాథపల్లిలో పులి సంచరించింది. మరో పక్క గత ఏడాది ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన పులి ఇద్దరు మనుషులపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
ప్రజలు భయాందోళనకు గురికావొద్దు
పులి సంచారం పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి భయాందోళనకు గురికావద్దు. రైతులు పంట పొలాలకు వెళ్తే చీకటి పడే కంటే ముందే ఇంటికి చేరుకోవాలి. అదేవిధంగా చేనులో కూడా గుంపులుగా వెళ్లి చప్పుడు చేస్తూ పనులు చేసుకోవాలి. అటవీశాఖ తరఫున ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. ప్రజలకు ఎక్కడైనా పులి పాదముద్రలు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలి.
- గులాబ్ సింగ్, ఎఫ్ఆర్ఓ, ఆదిలాబాద్






