కార్మికుల ఉసురు తగులుతుంది : బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్

by Nallavelli.Anjaneyulu |

రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల ఉసురు తగులుతుందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు.

కార్మికుల ఉసురు తగులుతుంది : బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
X

దిశ, మంచిర్యాల : రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల ఉసురు తగులుతుందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల ఆర్టీసీ డిపోలో కార్మికులు తలపెట్టిన సమ్మె కు సంఘీభావం తెలిపారు. నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుని గాయాలతో బాధపడుతూ మృతి చెందడం తీవ్ర బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ‌ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం రూ.1 కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. మృతి చెందిన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణలోకి తీసుకొస్తామన్న హామీలు గాలి మాటలు గానే మిగిలిపోయాయి అన్నారు.

ప్రభుత్వంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిన ఆర్టీసీ కార్మికుల గోడును వినిపించుకోలేదన్నారు. సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలపై కనీసం చర్చలు జరపకుండా కాలయాపన చేయడం సిగ్గు చేటన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 58 రోజులపాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కనీసం వారి సమస్యలు విన్న పాపాన పోలేదన్నారు. అప్పుడు 28 మంది కార్మికుల ఆత్మహత్యకు కారకుడు అయ్యారని ఆరోపించారు. ప్రస్తుతం అదే విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల ఉసురు తగిలి తగిన మూల్యం చెల్లించక తప్పదు అన్నారు. తక్షణమే శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగందుల.కృష్ణమూర్తి, వంగపల్లి.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వైద్య.శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు అమీర్ శెట్టి.రాజు, నాయకులు బెల్లంకొండ మురళి, శ్రీనివాస్, రాజబాబు, రాజన్న, కరీం, శ్రీనివాస్, శివ తదితరులు పాల్గొన్నారు.

Next Story