- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిజిస్ట్రేషన్లలో కొత్త రకం దోపిడీ..ఫోన్ పే కొట్టు.. సర్టిఫికెట్ పట్టు
మంచిర్యాల జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ అవినీతి ఊబిలో కూరుకుపోయింది.

రెవెన్యూలో ‘మామూళ్ల’ రాజ్యం
• రిజిస్ట్రేషన్లలో కొత్త రకం దోపిడీ.. ఖజానాకు కోట్లలో గండి
• ఫోన్ పే కొట్టు.. సర్టిఫికెట్ పట్టు..
• డిజిటల్ దందాలో యంత్రాంగం
• క్షేత్రస్థాయిలో కలెక్టర్ తనిఖీలు..
• అవినీతి తిమింగలాల గుండెల్లో రైళ్లు
దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. సామాన్యుడికి సేవ చేయాల్సిన కార్యాలయాలు అక్రమార్కులకు కాసుల కురిపించే గనులుగా మారాయి. ఒకవైపు టెక్నాలజీని వాడుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంటే, మరోవైపు చిన్నపాటి సర్టిఫికెట్ల కోసం వచ్చే పేదల రక్తాన్ని పిండుతున్నారు. ధరణి పోయినా, భూ భారతి వచ్చినా అధికారుల అవినీతి దాహం మాత్రం తీరడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి పనికి ఓ రేటును ఫిక్స్ చేస్తున్నారు. రైతులు ముడుపులు చెల్లిస్తేనే పనులు చేస్తున్నారు. జిల్లాలో అత్యధిక స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ, రీ సర్వే అర్జీలను జిల్లా అధికారులు స్వీకరిస్తున్నారు. ఆర్జీలను ఆసరా చేసుకుని రైతులను మండల తాసిల్దార్ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిప్పుకుంటున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
నెన్నెల మండలంలో వెలుగుచూసిన రిజిస్ట్రేషన్ల కుంభకోణం జిల్లావ్యాప్తంగా రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. సిటిజన్ లాగిన్‌ను ఆసరాగా చేసుకుని సేల్ డీడ్ విత్ పొసెషన్ కు బదులుగా వితౌట్ పొసెషన్ ఆప్షన్‌ను ఎంచుకుంటూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన 4శాతం నుండి 9 శాతం స్టాంపు డ్యూటీని నొక్కేశారు. రైతుల వద్ద పూర్తి మొత్తాన్ని వసూలు చేసి, ప్రభుత్వానికి మాత్రం నామమాత్రపు చలానా కడుతూ మిగిలిన సొమ్మును రూ. లక్షల్లో అధికారులు, దళారులు స్వాహా అనిపిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం నెన్నెల మండలం లోనే 31 డాక్యుమెంట్లు ఈ విధంగా తేలాయంటే, జిల్లావ్యాప్తంగా ఇంకెన్ని కోట్లు పక్కదారి పట్టాయో అర్థం చేసుకోవచ్చు
లావాదేవీలు...
తాసిల్దార్ కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది వారి బంధువులు లేదా వారికి దగ్గరగా ఉండే వారి నెంబర్లను దరఖాస్తుదారులకు ఇస్తూ ఆ నెంబర్లకు ఫోన్ పే చేయాలంటూ సూచిస్తున్నారు. సదరు డబ్బు వచ్చాకే దరఖాస్తును ఓకే చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. డబ్బు చెల్లించకుంటే దరఖాస్తుదారులకు సర్టిఫికెట్లు జారీ చేయడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పలువురు నుండి ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఏసీబీ దాడుల భయంతో నేరుగా నగదు తీసుకోవడం మానేసి, తమ కింద పనిచేసే ప్రైవేట్ వ్యక్తులు లేదా కుటుంబ సభ్యుల, స్నేహితుల ఫోన్ పే, గూగుల్ పే నంబర్లకు లావాదేవీలను మళ్లిస్తున్నారు.
ఏ పనికైనా రేటు ఫిక్స్ చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. బర్త్, డెత్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ల నుండి విరాసత్, మ్యుటేషన్ల వరకు ప్రతి ఫైలుకు ఒక రేటు నిర్ణయించి ఫోన్ పే కొట్టు సర్టిఫికెట్ పట్టు అనే మాదిరిగా కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా అవినీతికి పాల్పడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ని భీమిని తాసిల్దార్ కార్యాలయంలో వివిధ పనుల్లో జి పి ఓ లు చేయి తడపనిదే ఫైలు ముందుకు వెళ్లదు అనే ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తుంది.రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల విషయం లో మాత్రం అధికారులు మొండి వైఖరి ప్రద్శిస్తున్నట్లు సమాచారం, బెల్లంపల్లి రెవెన్యూ కార్యాలయం తోపాటు నెన్నెల, జైపూర్, తాండూర్ మండలాల్లో ఈ దందా బహిరంగ రహస్యమే అని తెలిసిన అధికారులకు ముడుపులు అందనిదే పనులు జరగడం లేదని అనుమానం లేకపోలేదు.
ఏసీబీ అధికారుల భయం..
గడిచిన ఏడాది కాలంలో జిల్లాలో ముగ్గురు అధికారులు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయినా, ప్రస్తుత అధికారుల్లో ఇసుమంతైనా చలనం లేకపోవడం అధికారులకు మామూలుగానే అయిపోయింది. పట్టుబడితే ఏమవుతుంది కొన్నాళ్లు సస్పెండ్ అవుతాం అనే మాదిరిగా రెవెన్యూ అధికారుల లీలలు పెట్రేగిపోతున్నాయి. రెవెన్యూ కార్యాలయాల్లో క్షేత్రస్థాయి పరిశీలన అధికారులు తమ ఏజెంట్లతో కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కలెక్టర్ తనిఖీలతో..
జిల్లాలోని అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా ఈ అక్రమాలపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్ నిశితంగా దృష్టి సారించారు. నెన్నెల కార్యాలయంలో స్వయంగా రికార్డులను తనిఖీ చేసిన కలెక్టర్, 2021 నుండి జరిగిన ప్రతి లావాదేవీని స్కానింగ్ చేయాలని ఆదేశించడంతో అవినీతి తిమింగలాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రివర్స్ ఎండార్స్‌మెంట్లలో వైఫల్యాలు, చలానా వ్యత్యాసాలపై ఆరా తీస్తుండటంతో త్వరలోనే మరిన్ని అవినీతి బాగోతం బట్ట బయలు కానుందా అనే సందేహాలు రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్ లోని లొసుగులను వాడుకుని ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్న రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధితులను వేధిస్తున్న అవినీతి అధికారులను బర్తరఫ్ చేయాలని పలువురు కోరుతున్నారు.






