ఏలేటి ఎటో..?

by Disha Web Desk 20 |
ఏలేటి ఎటో..?
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ పార్టీపై రాష్ట్ర అధిష్టానం పై గుర్రుతో ఉన్నారా.? అంటే అవుననే ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డితో అమీ తుమీ అంటూ తలపడుతున్న మహేశ్వర్ రెడ్డి ఇటీవల కాలంలో పార్టీ అధిష్టానం పై తన అసమ్మతి గళాన్ని మరింత బలంగా వినిపిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కకు పెడుతూ పార్టీలో పింక్, ఎల్లో, ఆరెంజ్ వారి ఆధిపత్యం సాగుతున్నదంటూ పరోక్షంగా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి పై వ్యతిరేక కూటమి కట్టిన ఉత్తం కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి వారితో కలిసి ఆయన జీ9 గ్రూపు ఏర్పాటుకు కీలకపాత్ర పోషించారు. అప్పటినుంచి ఆయన రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. నిర్మల్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో బలమైన పట్టు ఉన్న మహేశ్వర్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సైతం ఆయన ఆర్థికంగా అండగా నిలబడ్డారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యేంతవరకు కూడా ఆయనతో సఖ్యతగా ఉన్న మహేశ్వర్ రెడ్డి మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో రేవంత్ ను మహేశ్వర్ రెడ్డి విభేదిస్తూ వస్తున్నారు వ్యతిరేక కూటమితో జట్టు కట్టిన మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై తీవ్ర స్వరాన్ని వినిపించారు

అందరూ వెళ్లిన ఆయన ఒక్కడు మాత్రం...

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో రెండు రోజుల క్రితం పిసిసి ముఖ్య నేతల భేటీ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి పేరు మరోసారి అసమ్మతి వర్గీయుడిగా తెరపైకి ఎక్కింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా భేటీకి హాజరుకావాలని, విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిసి పోవాలని సూచించిన నేపథ్యంలో అసమతి వర్గంగా ముఖ్య నేతలు అందరూ హాజరైనప్పటికీ మహేశ్వర్ రెడ్డి మాత్రం ఆ సమావేశానికి వెళ్లలేదు. ఒకరిద్దరూ నేతలు గైర్హాజరు కాగా సమావేశానికి వెళ్లకపోవడం పై వారు వివరణ ఇచ్చినప్పటికీ మహేశ్వర్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు కనీసం స్పందించలేదు దీన్నిబట్టి చూస్తే ఆయన పార్టీ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సన్నిహితుల సమాచారాన్ని బట్టి అవసరం అయితే ఆయన పార్టీ వీడెందుకు సిద్ధపడుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్నది.

18 నుంచి నియోజకవర్గంలో యాత్ర.?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సొంతగా పార్టీలకతీతంగా తాను బలపడాలని మహేశ్వర్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలిసింది 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో కొత్త పంథా రాజకీయాలకు తెర తీశారు నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నద్ధమై చివరలో ప్రజారాజ్యం పార్టీ గుర్తుతో పోటీ చేసి గెలుపొంది నియోజకవర్గ చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించారు ఇది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరారు అప్పటినుంచి నియోజకవర్గానికి ఆయనే పెద్దదిక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ వైఖరి పట్ల నిరాశక్తతతో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ఆయన గతంలో మాదిరిగానే నియోజకవర్గ ప్రజల వద్దకు వెళ్లేందుకు యోచిస్తున్నారు అన్ని అనుకూలిస్తే ఈనెల 18 నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర లేదంటే మరో రకమైన రీతిలో ప్రజల వద్దకు వెళ్ళినందుకు సమయత్తం అవుతున్నట్లు తెలిసింది.

బీజేపీ ఆఫర్... బీఆర్ఎస్ వైపు చూపు..!

మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారన్న ప్రచారం కొంతకాలంగా ఎక్కువైంది అధిష్టానం పై తీవ్ర విమర్శలు చేయడం వెనుక ఆయన పార్టీ వీడే కోణం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు భారతీయ జనతా పార్టీ గాలం వేసినట్లు చెబుతున్నారు. దీన్ని బిజెపి శ్రేణులు కూడా సమర్థిస్తున్నాయి. పార్టీ నేత ఈటెల రాజేందర్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పార్టీకి చెందిన సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి తో బంధుత్వం ఉన్నట్లు కూడా చెబుతారు. మరోవైపు ఆయన బి ఆర్ ఎస్ వైపు కూడా చూస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగ్ అభ్యర్థులకే టికెట్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే అందులోనూ స్థానికంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉండగా ఇతరులకు టికెట్ ఇస్తారా అన్నది అనుమానమే.

అభ్యర్థుల మార్పిడి గనుక జరిగితే అవకాశం కోసం ప్రయత్నిస్తారని అందులో భాగంగానే మహేశ్వర్ రెడ్డితో భారత్ రాష్ట్ర సమితి నేత ఒకరు టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. హుజురాబాద్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరిన ముఖ్య నేత ఒకరు మహేశ్వర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు ఆయన ద్వారా అవసరం అయితే పరిస్తితులను బట్టి ఆయన బిఆర్ఎస్ వైపు చూస్తున్నారని కూడా అంటున్నారు. ఆయన మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం కావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెలాఖరులో గానే ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని మహేశ్వర్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఒకరు తెలిపారు.

ఇవి కూడా చదవండి : కొట్టుకున్న బీఆర్ఎస్ నేతలు..



Next Story

Most Viewed