అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోంది: హరీష్ రావు

by Web Desk |
అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోంది: హరీష్ రావు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని.. దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. గురువారం ఆయన నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నిర్మల్ జిల్లాలో రూ. 40 కోట్లతో నిర్మించే నూతన జిల్లా ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు.. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

'250 పడకల ఆసుపత్రి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. మీరు అడుగుతున్నట్లు.. సీఎం గారు ఇక్కడ మెడికల్, నర్సింగ్ కాలేజీ ఇస్తారనే నమ్మకం నాకూ ఉంది. మెడికల్ కాలేజీకి ఏర్పాటుకు మొదటి మెట్టు ఈ ఆసుపత్రి ప్రారంభం. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు కరోనా సమయంలో ఎంతో కష్టపడ్డారు. మీకు అభినందనలు. రాష్ట్ర హైకోర్టు కూడా కరోనా మూడో వేవ్ లో తెలంగాణ పనితీరును మెచ్చుకుంది. నీతి అయూగ్ కూడా మెచ్చుకున్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆశా వర్కర్ల జీతాలు తక్కువగా ఉండేవి. పెంచాలని రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేసేవారు. నాటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయి. ఇనుప కంచెలతో అడ్డుకున్నాయి. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత జీతాలు పెంచాం. 2014 ముందు రూ.1500 ఉంటే.. రూ.6 వేలకు పెంచాం. అడగకుండానే మళ్లీ 30 శాతం పెంచి ఇప్పుడు రూ.9750 ఇస్తున్నాము. మరింత బాగా పని చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని 27 వేల మందికి స్మార్ట్ ఫోన్లు కూడా ఇచ్చాము. ఒకప్పుడు ఆశాలు అంటే చిన్నచూపు.. ఇప్పుడు గౌరవం పెరిగింది. బాగా పని చేద్దాం. ప్రజల కోసమే మనం ఉన్నాము. మనం అందరం ప్రజలకు సేవకులం.

తెలంగాణలో బిపి, షుగర్ కేసులు పెరుగుతున్నాయి. ప్రాథమికంగా గుర్తించి మందులు ఇచ్చినా కొందరు అవగాహన లేక వేసుకోవడం లేదు. వారి గురించి కూడా మనం శ్రద్ధ చూపాలి. ఇలాంటి వారి కోసం హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించుకోబోతున్నం. పైలట్ ప్రాజెక్టుగా ఈనెల 5న ములుగు, సిరిసిల్లలో ప్రారంభిస్తున్నం.

అంగన్ వాడీలను కూడా ప్రభుత్వం బాగా చూసుకుంటున్నది. 2014 లో రూ.4200 ఉన్న జీతాన్ని పెంచింది. ఇప్పుడు రూ.13,650 అందుకుంటున్నారు. దేశంలోనే మనది అత్యధికం. తెలంగాణలో మందుల కొరత ఉండదు. కొరత ఉందంటే డాక్టర్ పై చర్యలు ఉంటాయి. మెడికల్ బడ్జెట్ పెంచాము. పేదలకు వైద్యం భారం కాకుండా చూస్తున్నది. 60 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నవి 3 మెడికల్ కాలేజీలు మాత్రమే. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలకు పెంచుకున్నము. ఆశాలు, అంగన్ వాడీలు, ఏఎన్ ఏం లు మీరు ఎంతో ముఖ్యం.. 80 శాతం సాధారణ డెలివరీలు అయ్యేలా కృషి చేద్దాం.

ఆరోగ్య రంగంలో మనం మొదటి స్థానానికి వెళ్ళాలి. ఏ ఇబ్బంది ఉన్నా చూసుకుంటా.. సీఎం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం చేసేలా కృషి చేస్తా.. మీరు ప్రజలకు నాణ్యమైన సేవలు చేయండి. ఒకప్పుడు నేనురాను బిడ్డో సర్కారు దావాఖాన అనే మాట ఉండే.. ఇప్పుడు నేను సర్కారు దవాఖానకే పోతా అనేలా అభివృద్ధి చేసాం. రాబోయే రోజుల్లో ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ కాబోతుంది' అని హరీశ్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖా నాయక్, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed