మక్క రైతు పై ఆంక్షల పిడుగు..!

by Disha Web Desk 20 |
మక్క రైతు పై ఆంక్షల పిడుగు..!
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : రైతు పండించిన ఇలాంటి పంటలనైనా చివరిదాకా కొనుగోలు బాధ్యత ప్రభుత్వానిదేనంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రకటనలు ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వం కొత్త కొత్త ఆంక్షలు పెడుతుండడంతో రైతులు చేసేదేమీ లేక పండించిన పంటలను దళారులకు అమ్ముకుంటున్నారు. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మక్క (మొక్కజొన్న) కొనుగోలు జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ ఫెడ్ ద్వారా మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేపడుతోంది. మద్దతు ధర క్వింటాలుకు 1970 రూపాయల ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఇది రైతులకు ఊరట కలిగించేలా అనిపించింది. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లకు మంచి ధర ఇస్తుందని రైతులు సంబరపడ్డారు కానీ తాజాగా ప్రభుత్వం కొన్ని నిబంధనలను పెట్టడంతో రైతులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. గత్యంతరం లేక మద్దతు ధర కన్నా 200 రూపాయల తక్కువ ధరతో దళారులకు అమ్ముకునే పరిస్థితి నెలకొంది.

ఎకరాకు 26 క్వింటాళ్ల ఆంక్షలతో రైతుకు నష్టం...

మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోళ్లకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తాజాగా ఎకరాకు 26 క్వింటాళ్లు మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ఇది రైతాంగానికి తీరని నష్టం మిగులుస్తుందని ఆవేదన చెందుతున్నారు. బాగా కష్టపడి సేద్యం చేసిన రైతులు నిర్మల్ జిల్లాలో అనేక గ్రామాల్లో ఎకరానికి 30 నుంచి 60 క్వింటాళ్ల దాకా మక్కల దిగుబడి సాధించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం క్వింటాలకు 1970 రూపాయలు రైతులకు చెల్లించాలి.

అయితే తాజాగా 26 క్వింటాళ్లు మాత్రమే ఎకరా చొప్పున కొంటామని ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంతో అదనంగా పండిన మక్కలను దళారులకు అమ్ముకునే పరిస్థితి ఎదురవుతున్నది. దీంతో రైతులు క్వింటాలకు 200 రూపాయల తక్కువ చొప్పున బయట మార్కెట్లో దళారులకు అమ్ముకుంటున్నారు. దీంతో రైతులు ఎకరానికి కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా 20 వేల దాకా నష్టపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వం దిగుబడుల పై ఆంక్షలు పెట్టడం బాధాకరమని రైతులు ఆందోళన చెందుతున్నారు.

లక్ష్యం సాధ్యమేనా..

మక్కల కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం అన్ని జిల్లాలకు టార్గెట్లు పెట్టింది. నిర్మల్ జిల్లాలో 5.7 లక్షల క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటిదాకా కేవలం 50 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు జరిగాయి. కొనుగోళ్ల శాతం ఇప్పటిదాకా జరిగిన వాటిని బట్టి లక్ష్యంలో కేవలం 10 శాతం మాత్రమే జరిగింది. మిగిలిన పంటను కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం విధించిన ఆంక్షలు అడ్డు వస్తున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రైతులు పంటలు వేసేటప్పుడే వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్ పేరిట రైతులు వేసే పంటలను నమోదు చేస్తారు. ఆన్ లైన్ లో ప్రభుత్వానికి నివేదికను పంపుతారు.

రైతులు కష్టపడి ఎకరానికి 26 క్వింటాలకు పైగా పండించినప్పటికీ ఆ ధాన్యం జీరో కిందనే లెక్క కట్టే పరిస్థితి ఎదురవుతోంది. దీనివల్ల భారీ దిగుబడులు వచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇది రైతాంగానికి తీరని నష్టం చేస్తుందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. వెంటనే ప్రభుత్వం ఎకరాకు 26 క్వింటాళ్ల ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పెట్టిన ఆంక్షలమూలంగా మద్దతు ధర కన్నా 200 రూపాయల తక్కువ ధరతో రైతులు తాము పండించిన మొక్కజొన్న పంటను మధ్య దళారులకు అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారం అంతా యంత్రాంగానికి తెలిసినప్పటికీ రైతుల బాధలు తీర్చే నాథుడు కనిపించడం లేదు. ఈ పరిస్థితి నిర్మల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నెలకొంది.

ఎకరానికి 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తాం... ప్రవీణ్ రెడ్డి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజరు, నిర్మల్

రైతులు మొక్కజొన్న పంట విషయంలో ఎంత దిగుబడి సాధించినప్పటికీ వారికి ఉన్న భూమినిబట్టి ఎకరానికి 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తాం. అంతకుమించి ఎంత ఎక్కువ పండించిన ఆ మక్కలకు ప్రభుత్వ మద్దతు ధర ఇవ్వలేము ఎకరానికి 26.70 క్వింటాళ్ల మక్కలు మాత్రమే కొనుగోలు చేయాలని తమకు ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. ప్రభుత్వం విధించిన నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేస్తామని వెల్లడించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed