మున్సిపల్ ఎన్నికల్లో నయా రూల్...ఇక వాళ్ల‌దే ఖ‌ర్చు !

by velandi.Saikiran |

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో తమ పట్టు నిలుపుకునేందుకు నియోజకవర్గాల శాసనసభ్యులు సైతం కౌన్సిలర్ అభ్యర్థులకు ఎంతో కొంత ఖర్చు చేసే పరిస్థితి కనిపిస్తున్నది.

మున్సిపల్ ఎన్నికల్లో నయా రూల్...ఇక వాళ్ల‌దే ఖ‌ర్చు !
X

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల వేడి మొదలవడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతంలో కౌన్సిలర్లు తమ సొంత ఖర్చుతో పోటీ చేసేవారు, కానీ ఇప్పుడు చైర్మన్ పదవి దక్కాలంటే కౌన్సిలర్ల మద్దతు అనివార్యం కావడంతో చైర్మన్ అభ్యర్థులే కౌన్సిలర్ల ఖర్చులో సగభాగాన్ని భరిస్తున్నారు. నియోజకవర్గాల్లో తమ పట్టు కోల్పోకుండా ఉండటానికి ఎమ్మెల్యేలు కూడా ఒక్కో అభ్యర్థికి లక్షలాది రూపాయలు సర్దుబాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల వంటి మున్సిపాలిటీల్లో గెలుపు కోసం చైర్మన్ ఆశావహులు ఒక్కో కౌన్సిలర్ అభ్యర్థికి రూ. 3 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నయా రూల్ అభ్యర్థులపై ఆర్థిక భారాన్ని పెంచుతోంది.

దిశ ప్రతినిధి, నిర్మల్ : పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి కౌన్సిలర్ల పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు కొంతమేర ఆర్థిక చేయూత అందుతున్నది. గతంలో ఎవరికి వారుగా కౌన్సిలర్ అభ్యర్థులు ఖర్చు చేసే పరిస్థితి ఉండేది. కానీ తాజాగా మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పదవులు ఆశిస్తున్న వారు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న వారికి ఆర్థికంగా చేయూత ఇచ్చే పరిస్థితులు తాజాగా ఎదురవుతున్నాయి. దీనికి తోడు నియోజకవర్గాల శాసనసభ్యులు తమ పట్టు నిలుపుకునే ప్రయత్నంలో కౌన్సిలర్లు చైర్మన్ అభ్యర్థులకు కొంత ఆర్థిక చేయూత ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

సగం ఖర్చు చైర్మన్ అభ్యర్థులదే..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, లక్షేట్టిపేట, బెల్లంపల్లి, క్యాథన్‌పల్లి, ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈసారి మెజారిటీ మున్సిపాలిటీలు బీసీ అభ్యర్థులకు ఖరారయ్యాయి. అయితే మున్సిపల్ చైర్మన్ స్థానం దక్కాలంటే ఖచ్చితంగా కౌన్సిలర్ల మెజారిటీ సాధించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ఆయా రాజకీయ పార్టీలు చైర్మన్ పదవులపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ముందుగా కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకునే పనిలో పడ్డాయి. ఇందుకు ఆర్థికంగా చైర్మన్ అభ్యర్థులను ముందస్తుగానే ఖరారు చేస్తున్నాయి. చైర్మన్ అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కౌన్సిలర్లకు కనీసం రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఆర్థికంగా చేయూతను ఇచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల వంటి మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవి ఆశిస్తున్న వారు రూ.5లక్షలు నుంచి రూ.10లక్షల వరకు ఒక్కొక్క కౌన్సిలర్ అభ్యర్థులకు ఆర్థిక చేయూత ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఎన్నికల నియమావళి ప్రకారం ఈస్థాయిలో ఖర్చు లేకపోయినప్పటికీ పరోక్షంగా ఎన్నికల కమిషన్ దృష్టిలో పడకుండా జరిగే ఖర్చులో భాగంగా డబ్బులు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యేలకు తప్పని ఖర్చు..

ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో తమ పట్టు నిలుపుకునేందుకు నియోజకవర్గాల శాసనసభ్యులు సైతం కౌన్సిలర్ అభ్యర్థులకు ఎంతో కొంత ఖర్చు చేసే పరిస్థితి కనిపిస్తున్నది. కనీసం ఒక్క అభ్యర్థికి రూ.2లక్షల నుంచి రూ.3లక్షల మేర ఎమ్మెల్యేలు సర్దుబాటు చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. మున్సిపల్ స్థానాలు చేజారితే భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల నాటికి తమ ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందన్న ఆలోచనతో ఎమ్మెల్యేలు సైతం మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి తలెత్తుతున్నది. చైర్మన్ అభ్యర్థులు కౌన్సిలర్ అభ్యర్థులు బలంగా లేని చోట ఎమ్మెల్యేలకు ఆర్థిక భారం మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్, నిర్మల్, బైంసా, ఆదిలాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి మున్సిపాలిటీలలో ఖర్చు భారీగా అవుతుందన్న ప్రచారం మొదలైంది. ఈ మున్సిపాలిటీలపై ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు దృష్టి పెట్టి ఎలాగైనా చైర్మన్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

Next Story