డబుల్ ఇళ్ల డ్రాపై దుమారం

by velandi.Saikiran |   (  Updated:2026-05-15 22:00:37  IST  )

ఆదిలాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లక్కీ డ్రా శనివారం జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది..

డబుల్ ఇళ్ల డ్రాపై దుమారం
X

డబుల్ ఇళ్ల డ్రాపై దుమారం..

• వేలాది దరఖాస్తులు.. పరిమితంగా ఇళ్లు

• లబ్ధిదారుల ఎంపికపై వెల్లువెత్తుతున్న అనుమానాలు

• నిరుపేద కుటుంబాల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠ

• రాజకీయ జోక్యంపై ప్రతిపక్షాల విమర్శల జడి

దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లక్కీ డ్రా శనివారం జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది.. ఆదిలాబాద్ పట్టణంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వ్యవహారం మరోసారి రాజకీయ,సామాజిక చర్చలకు కేంద్రబిందువుగా మారింది.ఎన్నో ఏళ్లుగా సొంతింటి కలతో ఎదురుచూస్తున్న వేలాది నిరుపేద కుటుంబాలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తుండగా, తాజాగా నిర్వహించనున్న లక్కీ డ్రాపై పట్టణ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. గతంలో నిర్వహించిన లక్కీ డ్రాల సమయంలో కూడా లబ్ధిదారుల ఎంపికపై విమర్శలు,ఆరోపణలు రావడంతో ఈసారి ప్రక్రియ ఎలా సాగుతుందనే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రభుత్వం పేదలకు ఇళ్లు అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ, ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా అనేక ఇళ్లు పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందలేదు.మరోవైపు నిజమైన అర్హులకు అవకాశం దక్కుతోందా..? లేక రాజకీయ సిఫార్సులు ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నారా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కాగా ఆదిలాబాద్ పట్టణంలో 2023 మే 9న నిర్వహించిన గత లక్కీ డ్రాలో మొత్తం 982 ఇళ్లకు గాను 618 ఇళ్లను డ్రా ద్వారా కేటాయించారు.ఇందులో ఎస్సీ వర్గాలకు 115, ఎస్టీలకు 38, మైనార్టీలకు 81, బీసీలకు 352, ఇతర వర్గాలకు 32 ఇళ్లు కేటాయించినట్లు అప్పట్లో అధికారులు వెల్లడించారు.అదనంగా 491 మంది అర్హులను వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచగా,తరువాత మరో 83 మందికి ఇళ్లు కేటాయించినట్లు సమాచారం. అయినప్పటికీ ఇంకా వందలాది కుటుంబాలు ఇళ్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి.

వేలాది దరఖాస్తులు.. పరిమిత ఇళ్లు

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.పేద, మధ్యతరగతి కుటుంబాలు సొంతింటి ఆశతో ప్రభుత్వ పథకంపై ఆధారపడ్డాయి. అయితే అందుబాటులో ఉన్న ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో లబ్ధిదారుల ఎంపిక పెద్ద సవాలుగా మారింది.గతంలో నిర్వహించిన డ్రాలో ఎంపిక కాని అనేక మంది ఇప్పటికీ ఇళ్ల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం కూడా మిగిలిన ఇళ్ల కేటాయింపుపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.మరోవైపు నిజమైన అర్హులకు అవకాశం దక్కడం లేదని,రాజకీయ సిఫార్సులు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.దీంతో ఈసారి లక్కీ డ్రా ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందా లేదా అన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

లక్కీ డ్రాపై భారీ ఆశలు..

నేడు ఆదిలాబాద్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించనున్న లక్కీ డ్రా కార్యక్రమంపై లబ్ధిదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ సమక్షంలో డ్రా నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో కార్యక్రమం నిర్వహిస్తామని చెబుతున్నారు.ఇళ్ల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కుటుంబాలు మాత్రం ఈసారి తమకు అవకాశం వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ఎంపికైన 618 మందికి ఇళ్లు కేటాయించగా, ఇంకా మిగిలిన అర్హుల పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది.వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న లబ్ధిదారులు కూడా ఈసారి తమకు అవకాశం దక్కుతుందా అని ఆసక్తిగా గమనిస్తున్నారు.

రాజకీయ రంగు..

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల అంశం ప్రస్తుతం రాజకీయంగా కూడా వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. అర్హుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతోందని చెబుతోంది. కొంతమంది వార్డు వారీగా ఎంపికలో అసమానతలు ఉన్నాయని ఆరోపిస్తుండగా, మరికొందరు లక్కీ డ్రా విధానం ద్వారానే పూర్తి పారదర్శకత సాధ్యమని అభిప్రాయపడుతున్నారు. పట్టణంలో ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల దృష్టి ఇప్పుడు లక్కీ డ్రాపై నిలిచింది.నిజమైన అర్హులకు న్యాయం జరుగుతుందా..? లేక మళ్లీ వివాదాలకే దారి తీస్తుందా..? అన్న చర్చ ప్రస్తుతం ఆదిలాబాద్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

Next Story