ముగిసిన బాసర ఉత్సవాలు..ఆదాయం ఎంత వ‌చ్చిందంటే

by velandi.Saikiran |   (  Updated:2026-01-23 21:46:02  IST  )

బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకొని ఆలయంలో అద్భుతమైన వీణాకచేరి నిర్వహించారు.

ముగిసిన బాసర ఉత్సవాలు..ఆదాయం ఎంత వ‌చ్చిందంటే
X

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మదిన వేడుకలు వసంత పంచమి పురస్కరించుకుని క్షేత్రంలో అత్యంత వైభవంగా, ప్రశాంతంగా ముగిశాయి. వేకువజాము నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులతో బాసర జనసంద్రంగా మారింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 6325 మంది చిన్నారులు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేసి చదువుల తల్లి ఆశీస్సులు పొందారు. భక్తుల రద్దీతో ఆలయానికి ఒక్కరోజే రూ. 56.38 లక్షల ఆదాయం సమకూరింది. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన అద్భుతమైన వీణాకచేరి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాయి. బాసర ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.

దిశ, బాసర : బాసర క్షేత్రంలో వసంత పంచమి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయం జనసంద్రమైంది. వేకువజామున 3గంటల నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు క్యూలైన్లలో బారులుదీరారు. ఈ పర్వదినాన రికార్డు స్థాయిలో 6325మంది చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు నిర్వహించగా, వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.56,38,275 ఆదాయం లభించింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షణలో పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాయి. ఆలయ అధికారులు క్యూలైన్లలో చిన్నారులకు పాలు, బిస్కట్లు పంపిణీ చేశారు. అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ, భక్తుల సరస్వతి శరణుఘోషతో బాసర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఆలయంలో వీణాకచేరి

వంద మంది కళాకారుల స్వరార్చన

బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకొని ఆలయంలో అద్భుతమైన వీణాకచేరి నిర్వహించారు. సాధారణ అక్షరాభ్యాస మండపంలో త్యాగరాజ, భక్త రామదాసు మ్యూజిక్ కళాశాలల అధ్యాపకురాలు పోతురాజు జయలక్ష్మి ఆధ్వర్యంలో 100 మందికి పైగా కళాకారులు ఏకకాలంలో వీణ వాయిద్యాన్ని వినిపించారు. బాసరలో ఒకేసారి ఇంతమంది కళాకారులు స్వరాలు పలికించడం ఇదే మొదటిసారి కావడంతో క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. ఈ సందర్భంగా నిర్వహించిన కప్పచ్చి అష్టోత్తర వీణ స్వరార్చనను భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించి, సంగీత ధ్వనుల్లో ఓలలాడారు.

Next Story