అన్నదాతకు పరిహారం అందేనా..?

by velandi.Saikiran |

ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఆగస్టు నెలలో భారీ వర్షాలు కురిశాయి.జిల్లాలో కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో

అన్నదాతకు పరిహారం అందేనా..?
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఎడతెరిపిలేకుండా కురిసిన అధిక వర్షాలకు పంటలు నిండా మునిగాయి. వర్షాలు ఆదిలోనే అన్నదాతలను ఆగమాగం చేశాయి. పంట కోసం వెచ్చించిన పెట్టుబడి మొత్తం కన్నీటిపాలైంది. వరద తీవ్రతకు పంటలు కొట్టుకుపోవడం..కొన్ని చోట్ల రోజుల తరబడి నీళ్లలోనే ఉండటంతో ఎందుకు పనికి రాకుండా పోయాయి. కొత్తగా పంటలు వేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రైతు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఓ వైపు పంటలకు మద్దతు ధర రాక, తేమశాతం అడ్డంకులు, రైతుబంధు లాంటివి రాక సగటు రైతు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కనీసం పంట నష్ట పరిహారమైనా వస్తుందని అనుకున్న రైతుకు ఆ జాడనే లేక బయట అప్పులు దొరకక దినదిన గండంలా బతికీడుస్తున్నాడు. ఈ దశలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలు ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. ఎకరాకు రూ.10వేల చొప్పున నష్ట పరిహారం అందిస్తామని హామీ ఇచ్చింది. జిల్లా ఇంచార్జి మంత్రి సైతం పంటలను పరిశీలించి రైతులకు దైర్యం చెప్పారు. వ్యవసాయశాఖ అధికారులు సర్వే చేసి పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపించారు. కానీ మూడు నెలలు గడుస్తున్నా పరిహారం జాడ లేకపోవడంతో అన్నదాతలు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక రబీ పంటలు వేయలేని దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.

అధిక వర్షాలతో అన్నదాత ఆగమాగం..

ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఆగస్టు నెలలో భారీ వర్షాలు కురిశాయి.జిల్లాలో కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో నదులు,వాగులు ఉగ్రరూపం దాల్చాయి. సరిహద్దుల్లో ఉన్న పంట పొలాలన్నీ ముంచేత్తాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రవహిస్తున్న పెన్ గంగా నది ఉదృతంగా ప్రవహించడంతో సరిహద్దులోని బేల,జైనథ్, భోరజ్,భీంపూర్,తాంసి మండలాలతో పాటు పలు వాగుల సమీపంలో ఉన్న సరిహద్దు గ్రామాల్లోని పంట పొలాలు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో పంటలన్నీ వర్షార్పణమయ్యాయి.పత్తి, సోయా,మొక్కజొన్న,జొన్న తదితర పంటలు వరద తీవ్రతకు గురయ్యాయి. స్పందించిన ప్రభుత్వం పంట నష్టం సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేసి జిల్లాలో 18,310ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదిక అందించింది.జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం రైతులను పరామర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు.కానీ 3 నెలలు గడుస్తున్నా పరిహారం పత్తాలేకుండా పోయింది. పంటలు కోల్పోయిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

పంట కోసం పైసలు లేక పరేషాన్..

ఖరీఫ్ లో అధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులు రబీ సీజన్లో ఆ లోటును కొంతైనా పూడ్చుకోవాలని భావిస్తున్నారు.తాజాగా రబీ సీజన్ ప్రారంభం కావడంతో శనగ,జొన్న తదితర పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు.కానీ ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం రాక.. ఎకరానికి రూ.6వేల చొప్పున అందించాల్సిన రైతుభరోసా నిధులు సైతం ఖాతాల్లో జమ కాకపోవడంతో అన్నదాతలు ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నారు.చేతిలో డబ్బులేక పంటలు వేయలేని పరిస్థితిలో ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికే ఖరీఫ్ పంట కోసం తీసుకొచ్చిన అప్పు తీర్చలేని పరిస్థితి ఉండటంతో..కొత్తగా అప్పు కూడా దొరకని పరిస్థితి కనిపిస్తోంది.ప్రభుత్వం నష్టపరిహారం డబ్బులను ఖాతాల్లో జమ చేస్తే రైతులకు కొంత వరకైనా ఊరట లభించేందుకు ఆస్కారం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సర్కారు మమ్మల్ని ఆదుకోవాలి

ఇప్ప సంతోష్, రైతు, పిప్పల్ కోటి..

ఖరీఫ్ లో వేసిన పత్తి పంట అధిక వర్షాలకు కొట్టుకుపోయింది.14ఎకరాల్లో పంట వేస్తే పూర్తిగా నష్టం జరిగింది.అధికారులు సర్వే సైతం చేశారు.కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి నష్ట పరిహారం అందలేదు.సర్కారు మా రైతుల బాధలు చూసి..త్వరగా పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నాం..

ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి..

సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు

జిల్లాలో అకాల,అతి వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పంట నష్ట పరిహారం రూ.10 వేలు అందజేయాలి.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి.కేంద్రం ఫసల్ బీమా యోజన అమలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకం తెస్తామని హామీ ఇచ్చి విస్మరించింది.రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు చట్టాలు తీసుకువస్తే బాగుంటుంది..

Next Story