మాజీ ఎమ్మెల్యేను కలిసిన సిర్పూర్ పేపర్ మిల్ కార్మిక సంఘాల జేఏసీ

by Batti.Sumithra |   (  Updated:2026-04-22 08:58:02  IST  )

కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని నిజాం కాలంలో 1938లో స్థాపించబడిన సిర్పూర్ పేపర్ మిల్లులో తక్షణమే ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యేను కలిసిన సిర్పూర్ పేపర్ మిల్ కార్మిక సంఘాల జేఏసీ
X

దిశ, కాగజ్‌నగర్ : కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని నిజాం కాలంలో 1938లో స్థాపించబడిన సిర్పూర్ పేపర్ మిల్లులో తక్షణమే ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు డిమాండ్ చేశారు. 2018లో పునఃప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి కార్మిక సంఘ ఎన్నికలు నిర్వహించకుండా, యాజమాన్యం తనకు అనుకూలంగా ఉన్న కొందరితో కలిసి చీకటి ఒప్పందాలు చేసుకుంటూ మిల్లును నడుపుతోందని ఆరోపించారు. కార్మికుల హక్కులు అడిగిన వారి పై సస్పెన్షన్‌లు, నోటీసులు జారీ చేస్తూ శ్రమను దోపిడీ చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ‘10 మెన్ కమిటీ’ను వెంటనే రద్దు చేయాలని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను పేపర్ మిల్ కార్మిక సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి బుధవారం వినతి పత్రం అందజేశాయి.

జేఏసీ నాయకులు మాట్లాడుతూ పేపర్ మిల్లులో వెంటనే కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని, కమిటీని రద్దు చేయాలని యాజమాన్యానికి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన రాలేదన్నారు. అందుకే కార్మిక సంఘాలకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోనేరు కోనప్పను కోరినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సానుకూలంగా స్పందిస్తూ, తాను ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన ఉంటానని చెప్పారు. జేఏసీకి పూర్తి మద్దతు ప్రకటిస్తూ, యాజమాన్యం కొందరితో కుమ్మక్కై రహస్య ఒప్పందాలు చేసుకుని కార్మికులకు అన్యాయం చేసిందని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి రహస్య ఒప్పందాలు జరగకుండా, కార్మికుల ఎన్నికల ద్వారానే ఒప్పందాలు జరగేలా తాను కీలక పాత్ర పోషిస్తానని హామీ ఇచ్చారు.

Next Story