- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచిర్యాలలో ఇసుక దందా దూకుడు.. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ రవాణా
మంచిర్యాల జిల్లాలో ఇసుక అక్రమ మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సామాన్యుడికి సైతం సరళమైన ధరలకే ఇసుక సరఫరా జరుగుతున్నట్లు ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

మంచిర్యాల జిల్లా సరిహద్దు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. అధికారులు నిఘా పెట్టకపోవడంతో అక్రమార్కులు వాగుల నుంచి ఇసుకను తోడేస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. వేమనపల్లి, బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి పరిధిలోని వాగులపై మాఫియా కన్ను పడింది. ఈ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పేరుతో ఒక లోడు అనుమతితో నాలుగు లోడుల ఇసుకను తరలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిబంధనలు అమలు కాకపోవడంతో సామాన్యులకు ఇసుక అందని ద్రాక్షలా మారింది. బహిరంగ మార్కెట్లో ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు విక్రయిస్తున్నారు. దీంతో నెలకు రూ.కోట్లలో అక్రమంగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రస్తుతం కొల్లూరు, ఇందారం, తాళ్లపల్లి, హాజీపూర్, కర్జి రీచుల ద్వారా బుకింగ్స్ సాగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే మైనింగ్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నా ఇసుక దందాకు అడ్డుకట్ట పడటం లేదు.
దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో ఇసుక అక్రమ మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సామాన్యుడికి సైతం సరళమైన ధరలకే ఇసుక సరఫరా జరుగుతున్నట్లు ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేటాయించిన రీచ్‌ల నుంచి పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ దందాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సరిహద్దు మండలాల పరిధిలోని గ్రామ వాగుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పగలు, రాత్రి ఇసుక రవాణా సాగుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో వాగుల్లో ఇసుకను తోడేస్తూ రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడే అవకాశాలు ఉన్నాయి.
వాగులపై అక్రమార్కుల కన్ను..
బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి, బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లోని గ్రామ సరిహద్దు వాగుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తరలిస్తున్నారు. మూడు నెలల క్రితం తాండూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను అధికారులు పట్టుకొని జరిమానా విధించారు. అలాగే భీమిని మండలంలోనూ పోలీసులు కొన్ని ట్రాక్టర్లను పట్టుకుని తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కన్నెపల్లి, భీమిని, చిన్న తిమ్మాపూర్ గ్రామ సరిహద్దు ప్రాంతాల్లో ఈ దందా జోరుగా నడుస్తోంది. వారం రోజుల క్రితం భీమిని మండలంలోని తంగళ్లపల్లి గ్రామ సరిహద్దు వాగు నుంచి జేసీబీ సహాయంతో ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లగా, వారిని చూసి అక్రమార్కులు పారిపోయారు. నెన్నెల మండలంలోని కర్జి గ్రామంలో ప్రభుత్వం ఇసుక రీచ్ ఏర్పాటు చేసినప్పటికీ, వర్షాకాలంలో వాగు నీటి ప్రవాహం కారణంగా ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి రావడంతో దాన్ని ఆపివేశారు. ప్రస్తుతం మంచిర్యాల ముల్కల ఇసుక రీచ్ నుంచి బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాలకు ఇసుక సరఫరా జరుగుతోంది.
సామాన్యులకు అందుబాటులో లేని ఇసుక..
భీమిని, కన్నెపల్లి, జనకాపూర్ వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం ఈ తంతు జరుగుతున్నా సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు ‘మన ఇసుక వాహనం’ అనే యాప్ ద్వారా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే లబ్ధిదారులకు వెసులుబాటు కల్పించినట్లు అధికారులు చెబుతున్నా, అది ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది.
అమలుకు నోచుకోని నిబంధనలు..
ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఇసుక సరఫరాలో కొంత వెసులుబాటు కల్పించినప్పటికీ, వారు రవాణా కోసం ట్రాక్టర్ల యజమానులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో సమీప వాగుల నుంచి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అనుమతి తీసుకుని, ఒక లోడు స్థానంలో నాలుగు లోడుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మార్కెట్లో ఒక్కో లోడును రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ దందాకు కొందరు రాజకీయ నాయకులు తెరలేపినట్లు తెలుస్తోంది. అక్రమార్కులు ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతూ జేబులు నింపుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
జిల్లాలోని ఇసుక రీచ్‌లు..
మంచిర్యాల జిల్లాలో చెన్నూరు మండలంలోని కొల్లూరు, బతుకమ్మ వాగు, జైపూర్ మండలంలో ఇందారం, నస్పూర్ మండలంలో తాళ్లపల్లి, హాజీపూర్ ఇసుక రీచుల ద్వారా ట్రాక్టర్లతో బుకింగ్ నడుస్తోంది. నెన్నెల మండలంలో కర్జిలో కూడా ఈ ప్రక్రియను మళ్లీ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ఉల్లంఘించి జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తే మైనింగ్ యాక్ట్ ప్రకారం చర్యలు ఉంటాయి. జిల్లాలోని ఆయా మండలాల్లో ఇసుక అక్రమంగా తరలిపోకుండా రెవెన్యూ అధికారులు కూడా తగిన చర్యలు తీసుకోవాలి.
- జగన్మోహన్ రావు, మైనింగ్ శాఖ అధికారి, మంచిర్యాల






