జోరుగా మట్టి మాఫియా.. చోద్యం చూస్తున్న మైనింగ్ శాఖ అధికారులు

by Kodari Anjali |

జిల్లాలో మట్టి మాఫియా బరితెగిస్తుంది.

జోరుగా మట్టి మాఫియా.. చోద్యం చూస్తున్న మైనింగ్ శాఖ అధికారులు
X

దిశ, మంచిర్యాల: జిల్లాలో మట్టి మాఫియా బరితెగిస్తుంది. అక్రమార్కులు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. అభివృద్ధి పేరుతో మట్టి తవ్వకాలను జోరుగా సాగిస్తున్నారు. ఎండాకాలం లోనే తమకు అనుగుణంగా మట్టి తవ్వకాలు చేయొచ్చని కొందరు అధికార పార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్నారు. వర్షాకాలం వస్తే మట్టిని తరలించేందుకు కష్టతరంగా మారుతుందని భావించి ప్రభుత్వ భూముల్లో, చెరువులు, కుంటలపై కన్నేసిన బడా నేతలు ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలకు చక్రం తిప్పుతున్నారు. జెసిబిల సహాయంతో లారీలు, ట్రాక్టర్లతో మట్టి రవాణా నడిపిస్తూన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం, బెల్లంపల్లి నియోజకవర్గంలో ఈ మట్టి దందా మూడు ట్రాక్టర్లు, 6 లారీలుగా వ్యాపారాన్ని చక్కదిద్దుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమ మట్టి రవాణా తవ్వకాలు చేపడుతున్న జిల్లా మైనింగ్ శాఖ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు మిన్నంటుతున్నాయి. దిశ ప్రత్యేక కథనం..

వాల్టా చట్టానికి తూట్లు..

జిల్లాలో వాల్ట చట్టానికి కొందరు తూట్లు పొడుస్తున్న మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో కన్నేసిన కొందరు మట్టి తవ్వకాలు చేస్తున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని అపవాదు ఉంది. ఏలాంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టీలకు మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. గోరంత అనుమతులతో కొండంత తవ్వకాలు చేపట్టి మట్టిని అక్రమంగా తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జైపూర్ మండలం ఎల్కంటి, శెట్పల్లి, కుందారం, నర్సింగాపూర్ గ్రామాలలో ప్రభుత్వ భూములు, చెరువుల వద్ద అక్రమ మట్టి రవాణా యదేచ్చగా సాగుతోంది. మట్టి పూడిక తీయడానికి అనుమతులు తీసుకున్న గుడిపేట వ్యక్తి పెద్దపల్లి కి చెందిన ఓ వ్యక్తి తో చేతులు కలిపిన ఓ వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఇటుక బట్టి లకు మట్టిని తరలించారు. అనుమతుల గడువు అయిపోయినప్పటికీ సదరు వ్యక్తులు అధికారుల కళ్ళుగప్పి అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టడంతో గ్రామస్తులు లారీలను అడ్డుకున్నారు. మట్టిని పక్క జిల్లా ప్రాంతాలకు తరలించడంతో ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇంత పెద్ద తతంగం నడుస్తున్న మైనింగ్ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎండాకాలం మట్టి తవ్వకాలకు కాలం కలిసి రావడంతో మట్టి అక్రమ రవాణా ఆక్రమణదారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. గ్రామస్తులు అక్రమ రవాణాను అడ్డుకొని పోలీసులకు సైతం మాచారం అందించారు. దీంతో మట్టి తరలిస్తున్న లారీలను పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

చోద్యం చూస్తున్న మైనింగ్ శాఖ..

ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కొందరు వ్యక్తులు జెసిబి లు ఏర్పాటు చేసి మట్టి తవ్వకాలు చేపట్టడం కలకలం రేపుతోంది. సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ భూముల పై కన్నేసిన కొందరు బడా నేతలు ఈ ఉదంతానికి ఒడిగట్టారు. పట్టణాల్లో ప్రధాన రహదారుల వెంట రియల్ ఎస్టేట్ వ్యాపారులు మట్టిని తరలిస్తున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో మట్టి వనరులు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయని సమీప ప్రాంత ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అభివృద్ధి పేరిట ఇందిరమ్మ ఇండ్లు, ఫ్లాట్లు, ఇటుక బట్టీలకు ఈ మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మైనింగ్, రెవెన్యూ అధికారుల కు మామూలు అందడంతోనే మట్టి అక్రమ దందాను జోరుగా నడిపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

రాత్రి పగలు మట్టి అక్రమ రవాణా..

అనుమతుల పేరిట నడుస్తున్న ఈ అక్రమ మట్టి రవాణా కు అడ్డు చెప్పేవారు లేకపోవడంతో అర్ధరాత్రి మట్టి తరలింపు జరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లుతోందని అభిప్రాయాలు లేకపోలేదు, మరో పక్క అధికారం అండదండలతోనే మట్టి అక్రమ వ్యవహారం పై తెరచాటున కొందరు బడా నేతలు ఉన్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా రహస్య ప్రాంతాల్లో అనేక చోట్ల మట్టి తవ్వకాలు జరుగుతున్న మైనింగ్, రెవెన్యూ శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తో మట్టి దందా సరిహద్దులు దాటుతోంది. కొందరు బడా కాంట్రాక్టర్లు అధికారులతో కుమ్మక్కై నెల నెల మామూలు అందించడంతో మట్టి దందా సరిహద్దులు సైతం దాటుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయి లో పర్యవేక్షణ చేపట్టి ఈ మట్టి అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story