నామినేటెడ్ పదవుల కోసం ముదిరిన పోటీ.. సంక్రాంతికి పదవులు?

by Naga Rani Yarlagadda |

అధికార కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల సందడి మొదలైంది. సంక్రాంతి లోపే ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.

నామినేటెడ్ పదవుల కోసం ముదిరిన పోటీ.. సంక్రాంతికి పదవులు?
X

దిశ,నిర్మల్ ప్రతినిధి : అధికార కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల సందడి మొదలైంది. సంక్రాంతి లోపే ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన నాయకులు కార్యకర్తలు పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు బొజ్జు పటేల్, ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, మంత్రి గడ్డం వివేకానంద సహా నియోజకవర్గ ఇన్చార్జీలు శ్రీహరి రావు, నారాయణరావు పటేల్, ఆడే గజేందర్, కంది శ్రీనివాస్ రెడ్డి, అజ్మీరా శ్యాం నాయక్ తదితరుల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు.

సహకార సంఘాలు సహా భారీగా ఖాళీలు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సహా డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు డైరెక్టర్ల పదవులను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. సహకార సంఘాలకు ప్రభుత్వం మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన విరమించుకుని నామినేటెడ్ విధానంలో పాలకవర్గాలను నియమించే ఆలోచన చేస్తున్నట్లు కూడా స్పష్టత వచ్చింది. అనుకున్నట్లుగానే ప్రభుత్వం సహకార సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలకవర్గాలను నియమిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 400లకు పైగా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలకు పదవులు దక్కనున్నాయి. సహకార సంఘాల చైర్మన్ పదవులు నామినేటెడ్ విధానంలో భర్తీ చేస్తే ఆయా సంఘాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రైతు నేతలకు అవకాశం దక్కుతుంది. సుమారు 12 సంవత్సరాలుగా పదవులకు దూరంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈసారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలన్న ఆశతో పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ముఖ్య నేతల చుట్టూ తిరుగుతూ ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి తోడు పలు దేవాలయ కమిటీల కాలపరిమితి కూడా ముగిసింది. వాటిని కూడా భర్తీ చేస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలకు అధికార పదవులు దక్కుతాయని ఆశిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో పదవీకాలం పూర్తయిన దేవరకోట దేవస్థానం పాలకమండలి స్థానంలో కొత్త కార్యవర్గాన్ని ప్రకటించగా వారు ఇటీవలనే బాధ్యతలు చేపట్టారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దేవాలయ కమిటీల కాల పరిమితి కొన్ని ముగిసిపోగా.. మిగతా దేవాలయాల కాల పరిమితి త్వరలోనే ముగియనుంది. వీటన్నింటికీ మళ్ళీ కొత్త కమిటీలను నియమించే అవకాశం ఉండడంతో ఈసారి కొత్తవారికి కమిటీల్లో ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. పార్టీ కోసం పనిచేసిన నేతలు కార్యకర్తలను గుర్తించే బాధ్యతలను నియోజకవర్గ ఇన్చార్జీలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు అధిష్టానం అప్పగించింది. వీరు ఇచ్చిన నివేదికల మేరకు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని, సంక్రాంతి లోపే పదవులు భర్తీ చేసే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది.

డీసీసీబీ,డీసీఎస్ంలకు సైతం

కాగా జిల్లా స్థాయిలో కీలకమైన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల పాలకవర్గాలకు కూడా ఈసారి నామినేటెడ్ పద్ధతిలో కమిటీలను నియమిస్తారని తెలుస్తున్నది. ఎమ్మెల్యే స్థాయి హోదాలో ఉండే డీసీసీబీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. అలాగే డీసీఎంఎస్ చైర్మన్ పదవికి కూడా పోటీ ఎక్కువగానే ఉంటుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో మాదిరిగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి తూర్పు జిల్లాకు ఒకటి పశ్చిమ జిల్లాకు ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ పాలకవర్గాలను పాత పద్ధతిలో ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున నియమిస్తారా..? లేదా కొత్త జిల్లాలను గుర్తించి రీ ఆర్గనైజ్ చేసి కొత్త జిల్లాలకు కూడా డీసీసీబీ డీసీఎంఎస్ లను ఖరారు చేస్తారా అన్నది ఇంకా తేలలేదు. అందిన సమాచారం మేరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పెంచే అవకాశం ఉందని డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాలు పాత జిల్లాల ప్రాతిపదికనే ఉంటాయని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున ఇస్తే పోటీ విపరీతంగా ఉండే అవకాశం ఉంది. డీసీసీబీ చైర్మన్ పదవిపై ఇద్దరు నియోజకవర్గ ఇన్చార్జీలు కన్నేసినట్లు ప్రచారం మొదలైంది.

Next Story