ట్రాన్స్‌ఫార్మర్ పెట్టకముందే కుంగిన గద్దె.. విచారణకు స్థానికుల డిమాండ్

by Naga Rani Yarlagadda |

బజార్‌హత్నూర్ మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలను తగ్గించేందుకు చేపట్టిన కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల గద్దెల నిర్మాణం వివాదాస్పదంగా మారింది.

ట్రాన్స్‌ఫార్మర్ పెట్టకముందే కుంగిన గద్దె.. విచారణకు స్థానికుల డిమాండ్
X

దిశ, బజార్ హత్నూర్ : బజార్‌హత్నూర్ మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలను తగ్గించేందుకు చేపట్టిన కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల గద్దెల నిర్మాణం వివాదాస్పదంగా మారింది. కొత్త బస్టాండ్ సమీపంలో నిర్మించిన ఒక ట్రాన్స్‌ఫార్మర్ గద్దె.. పనులు పూర్తయి రెండు నెలలు కూడా గడవక ముందే పూర్తిగా నేలమట్టమైంది. అసలు దానిపై ట్రాన్స్‌ఫార్మర్ భారాన్ని ఉంచకముందే గద్దె భాగం కుంగిపోవడం ఇక్కడి నిర్మాణ పనుల నాణ్యతను, కాంట్రాక్టర్ల ఘోర నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. నిర్మాణంలో నిబంధనల ప్రకారం సిమెంట్‌, ఇసుక మోతాదులు వాడకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ఇది ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న వ్యవహారమని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బరువు పెరిగితే ప్రమాదమే.. విచారణకు డిమాండ్

సాధారణంగా ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్ టన్నుల కొద్దీ బరువు ఉంటుంది. గద్దె నిర్మాణమే ఇంత బలహీనంగా ఉంటే, రేపు దానిపై విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ బరువుకు కుప్పకూలితే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. చుట్టుపక్కల జనం తిరిగే బస్టాండ్ ప్రాంతం కావడంతో కరెంట్ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని వాపోతున్నారు. అసలు ఈ గద్దెల నిర్మాణ నాణ్యతను విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షించారా? లేదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన రీతిలో తిరిగి నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story