మూడో విడ‌త ఎన్నిక‌లు..మావోల కదలికలతో మరింత కట్టుదిట్టం

by velandi.Saikiran |

గ్రామపంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం

మూడో విడ‌త ఎన్నిక‌లు..మావోల కదలికలతో మరింత కట్టుదిట్టం
X

మూడో విడతకు సర్వం సిద్ధం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది

భారీగా పోలీసులు బందోబస్తు...

ఆసిఫాబాద్ జిల్లాలో మావోల కదలికలతో మరింత కట్టుదిట్టం

ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీలు

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, సామగ్రిని భారీ పోలీస్ బందోబస్తు నడుమ తరలించారు. ముఖ్యంగా, తాజాగా ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు గుర్తించిన నేపథ్యంలో అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నిర్మల్ జిల్లాలో ముధోల్, బైంసా, బాసర, కుబీర్, తానూరు మండలాల్లో 124పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, 386 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచనలు చేశారు. బోథ్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎన్నికలు జరగనుండగా, పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ చివరి విడత ఎన్నికలు సజావుగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.

దిశ ప్రతినిధి నిర్మల్/ఆసిఫాబాద్/బోథ్/మందమర్రి

దిశ ప్రతినిధి నిర్మల్ : గ్రామపంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరగనుంది. తొలి, రెండవ విడత ఎన్నికల సందర్భంగా తలెత్తిన కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లా పంచాయతీ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఏర్పాట్లు పూర్తి చేశారు. సిబ్బందిని ఒక రోజు ముందుగానే అన్ని గ్రామాలకు తరలించారు. పోలీసు బందోబస్తుకు సంబంధించి ఎస్పీలు అన్ని పోలీస్ స్టేషన్ల హౌస్ అధికారులు, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అటవీ గ్రామాలకు బందోబస్తు నడుమ పోలింగ్ మెటీరియల్, సిబ్బందిని తరలించారు.

నిర్మల్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి..

నిర్మల్ జిల్లాలో మూడవ విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడవ విడత జిల్లాలోని ముధోల్, బైంసా, బాసర, కుబీర్, తానూరు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడత ఎన్నికలు జరగనున్న 133 గ్రామ పంచాయతీలకు 9గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 124పంచాయతీలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో 386మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ నేతృత్వంలో పోలింగ్ సామగ్రితో సహా సిబ్బందిని గ్రామాలకు తరలించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్య వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి షర్మిల పోలీసు అధికారులకు సూచనలు చేశారు.

బోథ్ నియోజకవర్గంలో ఏర్పాట్లు పూర్తి

దిశ, బోథ్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ బోథ్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో బుధవారం జరగనున్నాయి. నియోజకవర్గంలోని బోథ్, సోనాల, బజార్ హత్నూర్, గుడి హత్నూర్, తలమడుగు, నేరడిగొండ మండలాల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. బోథ్ మండల పరిధిలోని 21గ్రామ పంచాయతీల్లో 3పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 18పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే సోనాల మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు, బజార్ హత్నూర్ మండలంలోని 26 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల కేంద్రాల్లో ఎన్నికల పరిశీలకులు పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణకు బోథ్ మండలంలో 160పీఓలు, 216ఓపీఓలు విధుల్లో ఉన్నారు. సిబ్బంది తరలింపునకు 3రూట్లను ఏర్పాటు చేశారు. సోనాల మండలంలో 96 మంది పీఓలు విధుల్లో ఉన్నారు. సిబ్బంది తరలింపును 2రూట్లలో తరలించారు. బుధవారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరుగనుంది. అనంతరం మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుందని అధికారులు తెలిపారు. బోథ్ మండలంలో జరిగే ఎన్నికల నిర్వహణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్డీఓ స్రవంతి ప్రత్యేక సూచనలు చేశారు.

మూడో విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి

మందమర్రి మండలంలో 9సర్పంచ్, వార్డు సభ్యులకు నేడు పోలింగ్

దిశ, మందమర్రి : గ్రామ పంచాయతీ మూడవ విడత ఎన్నికలు నేడు నిర్వహించనున్నారు. మందమర్రి మండలంలో మొత్తం 10గ్రామ పంచాయతీలు ఉండగా, శంకర్ పల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కావడంతో అక్కడ వార్డు మెంబర్ ఎన్నికలు మాత్రమే జరుగనున్నాయి. మిగిలిన 9గ్రామ పంచాయితీల్లో సర్పంచ్, వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల బరిలో సర్పంచ్ అభ్యర్థులు 37మంది, వార్డు సభ్యుల అభ్యర్థులు 165మంది ఉండగా మొత్తం 80 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒకరు చొప్పున 10మంది రిటర్నింగ్ అధికారులు, 180మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఎన్నికలను పర్యవేక్షించడం కోసం మందమర్రి మండలంలో ముగ్గురు జోనల్ అధికారులు నియమితులయ్యారు. మోడల్ స్కూల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన క్యాంపులో ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల కేంద్రాల వద్ద పోలీసు భద్రతా బలగాలు ఉంటాయని అన్నారు. ఎంపీడీవో రాజేశ్వర్, తహశీల్దార్ పి.సతీష్ కుమార్ శర్మ ఎన్నికల సెంటర్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐలు ఎస్.రాజశేఖర్, రాజశేఖర్, శ్రీనివాస్, ఏఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story