- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక సహకార సందడి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సహకార సందడి మొదలైంది. గతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవ సహకార సంఘాలకు పాలక మండలిల నియామకాలు ఆయా సహకార సంఘం సభ్యులతో పరోక్ష ఎన్నికల ద్వారా నిర్వహించేవారు.

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సహకార సందడి మొదలైంది. గతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవ సహకార సంఘాలకు పాలక మండలిల నియామకాలు ఆయా సహకార సంఘం సభ్యులతో పరోక్ష ఎన్నికల ద్వారా నిర్వహించేవారు. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సొసైటీలకు నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్, వైస్ చైర్మన్ సహా డైరెక్టర్ పదవులతో పాలకమండలను ఖరారు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల పాలకవర్గాల నియామకానికి సంబంధించి ఒక్కసారిగా రాజకీయ వేడి మొదలైంది. ప్రత్యక్షంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే ఈ పాలకవర్గాలు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ఆ పార్టీలోనే రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలో 80 కి పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో 22 పిఎసిఎస్, ఎఫ్ఎస్సిఎస్ సంఘాలు నడుస్తున్నాయి. కొత్తగా ఈ జిల్లాలో ఏర్పాటు అయిన మండలాలకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు. మంచిర్యాల జిల్లా లో మొత్తం 20 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. మండలాల విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన కన్నెపల్లి, భీమారం 2 మండలాల కోసం ప్రతిపాదనలు పంపించారు. ఆసిఫాబాద్ జిల్లాకు నూతనంగా ప్రాథమిక సహకార సంఘాలు ఇంకా ఎన్ని కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రస్తుతం మొత్తం 12 సహకార సంఘాలు ఉన్నాయి. ఈ జిల్లాలో కొత్తగా రెండు ప్రతిపాదనలు చేశారు. చింతల మానే పల్లి. లింగపూర్ లకు కొత్త సొసైటీల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు 28 ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు అయిన మూడు మండలాలకు సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. మరోవైపు ఇప్పటికీ వైశాల్యం రీత్యా జనాభా రీత్యా పెద్దగా ఉన్న మండలాలను విభజించి రెండు చొప్పున సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో 15 దాకా సహకార సంఘాల ఏర్పాటుకు ఒత్తిడి పెరుగుతున్నది.
అధికార పార్టీకే అన్ని పదవులు...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 80 పైగా వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా... చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ పదవులు కలిపి సుమారు 1000 మందికి పైగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ మండల స్థాయి నేతలకు అవకాశం దక్కనున్నది. గతంలో రైతులు ఓటర్లుగా పరోక్ష విధానంలో సహకార సంఘాల ఎన్నికలు జరిగేవి. కానీ తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నామినేటెడ్ విధానంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన వారికి మాత్రమే పదవులు దక్కే పరిస్థితులు ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ కోసం తొలి నుంచి పనిచేస్తున్న వారిని గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలని టి పి సి సి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జిలు తయారుచేసిన జాబితాలు డిసిసిల ద్వారా పిసిసికి అందజేసేందుకు కసరత్తు మొదలైనట్లు సమాచారం.
పార్టీ కోసం కష్టపడ్డ వారికా...
గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో సహకార సంఘాల చైర్మన్లు వైస్ చైర్మన్ డైరెక్టర్ పదవులు అనుభవించిన వారందరూ దాదాపుగా తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గతంలో వారికి ఉన్న అనుభవం రీత్యా మరోసారి సహకార సంఘాలకు వారిని కొనసాగిస్తారా... లేదంటే కొత్తవారికి అవకాశం ఇస్తారా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారి తీస్తున్నది. ముఖ్యంగా ప్రభుత్వం రైతుల విషయంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ సహకార సంఘాల పాలకమండలిల నియామకాలు కూడా భవిష్యత్తు రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తారని విశ్వసనీయంగా తెలుస్తున్నది. అయితే పార్టీ మారిన వారు ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి వారికి అవకాశం ఇస్తారన్న ఆశతో గతంలో పనిచేసిన చైర్మన్లు వైస్ చైర్మన్లు ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు సహా అనేక పిఎసిఎస్, ఎఫ్ఎస్ సి ఎస్ ల చైర్మన్ వైస్ చైర్మన్ లు 90% పైగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం వారంతా కాంగ్రెస్ మద్దతుదారులుగానే కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి తమకు అవకాశం కల్పించాలని ఒత్తిడి పెంచే పరిస్థితులు నెలకొన్నాయి.
ఇన్చార్జీలు చెప్పింది ఫైనల్..
ఇదిలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్ మంచిర్యాల చెన్నూరు బెల్లంపల్లి నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా నిర్మల్, ముధోల్, ఆదిలాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, ఆసిఫాబాద్, బోథ్ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీలు కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి వీరు ఇచ్చే వారికే సహకార పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే చాలాచోట్ల పాత, కొత్త నేతల సమీకరణలు ఇటు దారితీస్తాయో తెలియని పరిస్థితి ఉంది.






