- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారుతున్న సరిహద్దులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా నాలుగు నుంచి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి.

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా నాలుగు నుంచి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో... కొత్తగా ఏర్పాటు అయ్యే నియోజకవర్గాలపై ప్రచారం మొదలైంది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా... కేంద్రం నిర్ణయంతో కొత్తగా నాలుగు నుంచి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు తోడుగా ఒక ఎస్సి ఒక ఎస్టి నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉండగా మరో మూడు జనరల్ స్థానాలు పెరుగుతాయని రాజకీయ వర్గాలు ఆశిస్తున్నాయి.
డీలిమిటేషన్ ఆశలు...
దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో... తెలంగాణలో 60 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం మొదలైంది. ఆ లెక్కన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనీసం నాలుగు నుంచి ఐదు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పక్షాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి మొదలైంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల అసెంబ్లీ స్థానాలు మారుతాయని... కొత్తగా కొన్ని స్థానాలు క్రియేట్ అవుతాయని దాని ద్వారా రాజకీయ భవిష్యత్తు తమకు కలుగుతుందన్న అభిప్రాయంతో పలువురు సీనియర్ నేతలు ఆశపడుతున్నారు.
5 స్థానాలు కొత్తగా ఖాయం...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తాజాగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల మేరకు మరో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని ప్రచారం మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రిజర్వేషన్లు సైతం మారతాయని అభిప్రాయాలు మొదలయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్టి రిజర్వుడ్ నియోజకవర్గాలు అయిన ఖానాపూర్. బోథ్ నియోజకవర్గ కేంద్రాలు జనరల్ అవుతాయని చెబుతున్నారు. అదే క్రమంలో కొత్తగా ఉట్నూరు సహా మరో కొత్త అసెంబ్లీ స్థానం ఏర్పాటుచేసి ఎస్టీలకు కేటాయిస్తారని చెబుతున్నారు. నిర్మల్ నియోజకవర్గాన్ని విభజించి కొత్తగా నరసాపూర్ జి మండల కేంద్రాన్ని నియోజకవర్గంగా మారుస్తారని చెబుతున్నారు. ఖానాపూర్ అసెంబ్లీ స్థానం జనరల్ గా మారుస్తారని అదే క్రమంలో... ఉట్నూరు ఎస్టి నియోజకవర్గంగా మారుస్తారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
బోథ్ నియోజకవర్గం సైతం జనరల్ అవుతుందని... ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గ సంబంధించిన కొన్ని మండలాలను కలిపి కొత్తగా ఇంద్రవెల్లి కేంద్రంగా నియోజకవర్గ ఎస్టీ రిజర్వుడు ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఇక ఎస్సీలకు సంబంధించి తూర్పు ప్రాంతంలో కొత్తగా ఒక నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. అలాగే పశ్చిమ ప్రాంతంలో నిర్మల్ జిల్లాలో ప్రాంతాల వారీగా విభజన జరిగిన అనంతరం విభజిత ముధోల్ నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లాలో కొత్తగా ఒక జనరల్ స్థానం తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ ,నిర్మల్, మంచిర్యాల నియోజకవర్గాలకు సంబంధించి కొత్తగా అర్బన్ రూరల్ నియోజకవర్గాలు ఏర్పాటు చేసేందుకు కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల ఖరారు జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు అయ్యే కొత్త నియోజకవర్గాల విషయంలో పూర్తిస్థాయి స్పష్టత రావాలంటే వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.






