- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైల్వే లైన్‌కు పడని ముందడుగు.. పట్టు వదలని విక్రమార్కుడిలా ఎంపీ నగేష్ తీవ్రయత్నాలు
నేనెక్కే రైలు.. జీవిత కాలం లేటు అన్న చందంగా ఆర్మూర్ ఆదిలాబాద్ వయా నిర్మల్ రైల్వే లైను అడుగు ముందుకు పడడం లేదు.

దిశ, ప్రతినిధి నిర్మల్: నేనెక్కే రైలు.. జీవిత కాలం లేటు అన్న చందంగా ఆర్మూర్ ఆదిలాబాద్ వయా నిర్మల్ రైల్వే లైను అడుగు ముందుకు పడడం లేదు. ప్రతిసారి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈసారి ఖాయం అన్నట్లుగా బలమైన ప్రచారం జరుగుతుంది. చివరకు బడ్జెట్ లో ఈ రైల్వే లైను ఊసు లేకుండా పోతుండడంతో రైల్వే లైన్ పై ఆశలు పెట్టుకుంటున్న నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు ఉసూరుమంటున్నారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన పలువురు పార్లమెంటు సభ్యులు ఈ రైల్వే లైన్ కోసం విశేషంగా కృషి చేసినప్పటికీ ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు జి నగేష్ మరింత పట్టుదలతో పట్టు వదలని విక్రమార్కుడిలా రైల్వే లైను సాధన కోసం పాటుపడుతున్నారు.
రూ.4300 కోట్లతో డీపీఆర్.. ఎంపీ నగేష్ తీవ్ర కృషి
ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ దాకా రైల్వే లైను నిర్మాణం కోసం సుమారు మూడు దశాబ్దాలకు పైగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. 137 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ రైల్వే లైన్ కోసం రూ.4300 కోట్లు అవసరం అవుతాయని డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ( డీపీఆర్ ) సిద్ధం చేసి సౌత్ సెంట్రల్ రైల్వే ద్వారా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తో పాటు, రైల్వే బోర్డు చైర్మన్ కు అందజేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు సైతం కలిసి ఈ రిపోర్టును అందించారు. ఈ రైల్వే లైను పూర్తి అయితే నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలు పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి అటు మహారాష్ట్రతో బలమైన సంబంధాలు పెరుగుతాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ప్రాజెక్టు హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సుమారు 7లక్షల మంది జనాభాకు ఈ రైల్వే లైను అనుకూలంగా మారే అవకాశం ఉంది అలాగే నిర్మల్ బైంసా ఉట్నూరు ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్లతో పాటు ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల ప్రజలకు సౌకర్యంగా మారే పరిస్థితులు ఉన్నాయి. ఈ రైల్వే లైన్ కోసం ఎంపీ నగేష్ విశేష కృషి చేస్తూనే ఉన్నారు. నిరంతరం ఈ రైల్వే సాధన కోసం ఆయన చేస్తున్న చిత్తశుద్ధి వెలకట్టలేనిదన్న అభిప్రాయాలు ఉన్నాయి అయితే కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వెలువడకపోవడం, బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం పట్ల నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా ప్రజల్లో నిరాశను నింపుతుంది.
రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి సైతం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు ఎస్ నిరంజన్ రెడ్డి తాజాగా ఆర్మూర్ వయా నిర్మల్ ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణం కోసం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్‌తో వెళ్లి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశారు. కేంద్రంలో పలుకుబడి ఉన్న నేతగా నిరంజన్ రెడ్డికి పేరు ఉంది. సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా పేరు ఉన్న నిరంజన్ రెడ్డి నిర్మల్ వాసి. ఆ కోణంలోనే ఆయన తన సొంత జిల్లా మీదుగా రైల్వే లైను ఏర్పాటు చేస్తే జిల్లా ప్రజలకు మేలు జరుగుతుందన్న ఆశతో ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. తాజా ప్రతిపాదనలతో కేంద్రం పై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బడ్జెట్ ఖరారు అయినందున సప్లిమెంట్ బడ్జెట్ కింద ఏమైనా నిధులు కేటాయించే అవకాశం ఉండవచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి లేదంటే వచ్చే ఏడాది దాకా ఎదురు చూడక తప్పదు.






