గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి: ఎమ్మెల్యే

by Kodari Anjali |

గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.

గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి: ఎమ్మెల్యే
X

దిశ, ఉట్నూర్: గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఉట్నూర్‌లోని కొమురంభీం కాంప్లెక్స్‌లో గల సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో మంద మకరందుతో కలిసి ఉమ్మడి జిల్లాల సర్మేడి నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, పీవో మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందన్నారు. గోండి భాషను కంప్యూటర్ వ్యవస్థలలో పొందుపరచి అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామనీ, విద్య ద్వారానే గిరిజన గ్రామాలు భవిష్యత్తులో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని, గిరిజనుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పే లక్ష్యంతో గిరిజన ప్రాంతాలలో పర్యాటక రంగ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, గిరిజనుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు.

సంక్రాంతి సెలవులకు బదులుగా...

గిరిజన ప్రాంతాలలో విద్య, వైద్యం, సంస్కృతి పరిరక్షణ, మార్కెటింగ్ అవకాశాలు, ఉపాధి కల్పన, పరిపాలనా వ్యవస్థ, గిరిజన హక్కులు, మౌలిక వసతుల అభివృద్ధి, కూరగాయల సాగు, వెదురు (బ్యాంబూ) ఆధారిత పరిశ్రమలు, పల్లిపట్టి, మహువా లడ్డూల తయారీ, శానిటరీ న్యాప్కిన్ పరిశ్రమలు, చేపల పెంపకం, గోండి భాష అభివృద్ధి తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం గిరిజన ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి సార్ మేడీలు తీసుకువచ్చారు. గిరిజనులు దీపావళి పండుగను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకుంటామని, విద్యార్థులకు దసరా, సంక్రాంతి సెలవులకు బదులుగా దీపావళి పండుగకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలని కోరారు. కొంతమంది విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేస్తూ సమయపాలన లేకుండా క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొంటున్నారని, ఈ కారణంగా వారి విద్యాభ్యాసం దెబ్బతింటోందని తెలుపగా ఎమ్మెల్యే స్పందిస్తూ పోలీసు యంత్రాంగం, సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం స్థానిక మండల కేంద్రంలో సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో అన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన గ్రంథాలయాన్ని మంజూరు చేయడం జరిగిందని, ఈ గ్రంథాలయాన్ని గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల సార్ మేడిలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story