పార్టీ మద్దతుకు అభ్యర్థుల యత్నాలు

by velandi.Saikiran |   (  Updated:2025-11-24 23:15:59  IST  )

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెంచిన ప్రభుత్వ నిర్ణయంతో పాటు, నేడో రేపో నోటిఫికేషన్ వస్తుందన్న సమాచారంతో

పార్టీ మద్దతుకు అభ్యర్థుల యత్నాలు
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెంచిన ప్రభుత్వ నిర్ణయంతో పాటు, నేడో రేపో నోటిఫికేషన్ వస్తుందన్న సమాచారంతో సర్పంచ్ పదవులకు పోటీ చేసే నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో ఒక కీలకమైన గ్రామపంచాయతీ బీసీ రిజర్వేషన్ల పెంపు సమయంలో ఇతర సామాజిక వర్గాలకు కేటాయించగా... తాజా రిజర్వేషన్ల మార్పుతో తమకు అనుకూలంగా మారడంతో సోమవారం ఒక్క రోజునే ఆ గ్రామంలో 50 వేల విలువైన మద్యం ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. అలాగే కుబీర్ మండలంలో ఒక చిన్న గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్న నేతకు అనుకూలమైన రిజర్వేషన్ రావడంతో ఊరిలో ఉన్న వారందరికీ దావత్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం మండలంలో సైతం ఒక అభ్యర్థి గ్రామంలో కీలకమైన నేతలను పిలిపించి పార్టీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇలా సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు అయిన క్షణం నుంచి ఈసారి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న వారంతా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎక్కడికక్కడ డబ్బులు ఖర్చు చేస్తూ ఎన్నికల తేదీ నాటికి ఒక ఊపు తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తులు లేకుండా ఎన్నికలు జరుగుతుండడంతో... ప్రధానంగా అధికార పార్టీ మద్దతు కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల అధికార పార్టీ నుంచి అభ్యర్థులు పెరిగితే... బిజెపి, బీఆర్ఎస్ మద్దతు తీసుకోవాలన్న ఆలోచనతో సర్పంచ్ అభ్యర్థులు ఉన్నట్లు ప్రచారం మొదలైంది.

ఎమ్మెల్యేలు, పార్టీ నేతల చుట్టూ...

సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జిలను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అపసోపాలు పడుతున్నారు. ఇప్పటికే తమకు ఉన్న సంబంధాలతో పాటు గ్రామాల్లో ఉండే కీలక నేతలతో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇన్చార్జీలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. తాజాగా నాలుగు జిల్లాలకు డిసిసి అధ్యక్షులను ఖరారు చేసిన నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థుల ఖరారు వ్యవహారంలో వారు కీలకంగా మారనున్నారు. ముఖ్యంగా శాసనసభ్యులు ఉన్న నాలుగు నియోజకవర్గాలు కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో డిసిసి అధ్యక్షులు నియోజకవర్గాల ఇన్చార్జీలు కీలకం కానున్నారు. దీంతో నేతలు వారి చుట్టే ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టారు.

బీజేపీ, బీఆర్ఎస్ నేతలతో టచ్ లోకి...

మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు దొరకకపోతే బిజెపి టిఆర్ఎస్ మద్దతు తీసుకోవాలని కొన్నిచోట్ల సర్పంచ్ అభ్యర్థులు ప్లాన్ వేస్తున్నారు అయితే బిజెపి సైతం నాలుగు చోట్ల ఎమ్మెల్యేలను కలిగి ఉండగా టిఆర్ఎస్ రెండు చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి సైతం సర్పంచ్ అభ్యర్థులు తమ పార్టీ మద్దతు గెలిపించుకోవడం అగ్నిపరీక్షగా మారుతున్నది. తాజాగా నోటిఫికేషన్ కు ముందే నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి శనివారం నిర్మల్ నియోజకవర్గ కేంద్రంలో మూడు మండలాల కీలక నేతలతో సమావేశం నిర్వహించారు మండలాల నేతలకే అప్పగించారు. ఆదిలాబాద్ లో మాజీ మంత్రి జోగు రామన్న స్థానిక ఎన్నికలను సవాల్ గా తీసుకుంటూ ప్రజాక్షేత్రంలో ఉండేలా కార్యక్రమాలు చేస్తున్నారు ఇది సర్పంచ్ ఎన్నికల్లో బలంగా ఉండే వ్యూహమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Next Story