ప్రతీ ఏటా.. నట్టేట...!

by srinivas |
ప్రతీ ఏటా.. నట్టేట...!
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో: సాగునీటి ప్రాజెక్టులు కట్టేది పంటలు ముంచేందుకా...?, పంటలు సాగుచేసేందుకా..?, ఇదీ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక‌వ‌ర్గంలో ఓ రైతు ప్రశ్న.

స‌రే ప్రాజెక్టు బ్యాక్ వాట‌ర్‌తోని పంట‌లు మునుగుతున్నాయ్‌... మ‌రి ప్రభుత్వం న‌ష్టప‌రిహారం చెల్లించాలి క‌దా..? నష్ట పరిహారం ముచ్చటే లేదు. నాలుగేళ్ల నుంచి వానకాలంలో ఆఫీసర్లు వచ్చుడు, సర్వే చేయడం, నష్టపోయిన రైతుల పేర్లు రాసుకుపోవుడు. గంతే పైసలు మాత్రం ఇచ్చుడు లేదు. ఇదీ ఓ రైతు ఆవేద‌న.

కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీరు ఇవ్వడం మాట దేవుడెరుగు..? రైతు కంట క‌న్నీరు తెప్పిస్తోంది. ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉండడంతో మంచి దిగుబడులు సాధించవచ్చని ఆశించిన రైతులకు బ్యాక్ వాట‌ర్ ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్‌ వాటర్‌తో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునుగుతున్నాయి. వర్షాకాలంలో గోదావరి ఉప్పొంగి నీరు పొలాలకు చేరుతుండటంతో చేతికొచ్చిన పంట నీటి పాలవుతోంది. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి పునరావృతమవుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

ప్రతీ ఏటా.. నట్టేట...

కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ కంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మంచిర్యాల జిల్లా రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్‌ వాటర్‌తో జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం కలుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి ఇదే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ప్రాజెక్టు నిర్మించినందుకు సంతోషించాలో, బాధపడాలో తెలియని పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీళ్లుంటే పొలాలు పండుతాయని, తమ కష్టాలు తీరుతాయని భావించిన రైతులకు కన్నీరే మిగులుతోంది. వర్షాకాలంలో గోదావరి ఉప్పొంగి నీరంతా సమీపంలోని పంట పొలాలకు చేరుతుండటంతో చేతికొచ్చిన పంట నీటి పాలవుతోంది. దాదాపు నాలుగేళ్ళుగా ఇదే పరిస్థితి పునరావృతం అవుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పొలాల్లోకి నీరు చేరి పంట మునిగిపోవడంతో అధికారులు నష్టం అంచనా వేసి, హడావుడి చేయడమే తప్ప రైతులకు ఒరగబెట్టిన మేలేదీ లేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ముంపు స‌మ‌స్యకు పరిష్కారం ఏదీ..?

ప్రాజెక్టుల బ్యాక్‌ వాటర్‌ నదికి రెండు వైపులా రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రవహిస్తూ పంటలను ముంచుతోంది. యేటా రెండు, మూడు సార్లు చేతికి వచ్చిన పంటలు నీట మునుగుతుండటంతో రైతులు దిగులు చెందుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలైన జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్‌, మంచిర్యాల, నస్పూర్‌, జైపూర్‌, చెన్నూరు, కోటపల్లి మండలాల్లోని నది ఒడ్డున ఉండే పంటలు తరుచుగా నీట మునుగుతుండగా, ప్రాణహిత పరివాహక ప్రాంతమైన వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోనూ ఇదే పరిస్థితి. బ్యాక్‌ వాటర్‌ కారణంగా వేల ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి ఇతర పంటలు నీళ్లపాలవుతున్నాయి.

ఇలా పంట నీట మునిగినప్పుడల్లా అధికారులు సర్వే జరిపి, పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేధిక పంపుతున్నారు. 2019 నుంచి ఇదే తంతు జరుగుతుండగా ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకున్న దాఖలాలు లేవు. రెండేళ్ల కింద‌ట అధిక వర్షాల కారణంగా బ్యాక్‌ వాటర్‌తో పంటలు నీట మునిగాయి. అప్పుడు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెన్నూరులో సమీక్ష ఏర్పాటు చేసి నీట మునుగుతున్న పంటలపై అధికారులు, రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. రైతుల‌కు మేలు చేసేలా చ‌ర్యలు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చినా అది గోదారిలో క‌లిసిపోయింది.

క‌ర‌క‌ట్టలు నిర్మించాల‌ని డిమాండ్‌

గత ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగడంతో ప్రాజెక్టుల బ్యాక్‌ వాటర్‌ చేలు, పొలాలను ముంచెత్తింది. ప్రస్తుతం ఈ సీజన్‌లో వర్షాకాలం ప్రారంభమైనందున మళ్లీ పంట నీట మునుగుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ముఖ్యంగా గోదావ‌రి తీరంలో క‌ర‌క‌ట్ట‌లు నిర్మించాల‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు. క‌ర‌క‌ట్టలు నిర్మించ‌క‌పోతే ఇబ్బందులు త‌ప్పవ‌ని ప్రతి ఏటా రైతులు మునుగుడేన‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ విష‌యంలో చ‌ర్యలు తీసుకోవాల‌ని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story