ఆరుగురు సిట్టింగ్లకు టికెట్ కట్..?

by Dishafeatures2 |
ఆరుగురు సిట్టింగ్లకు టికెట్ కట్..?
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార పార్టీ శాసన సభ్యులకు సీఎం కేసీఆర్ ఝలక్ ఇవ్వబోతున్నారా..? తాజాగా స్వయంగా చేయించుకున్న సర్వేల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేస్తున్నారని సమాచారం. శాసనసభ్యుల పనితీరుతో పాటు స్థానికంగా ప్రజల నుంచి ఉన్న వ్యతిరేకత ఆధారంగా మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే సీఎం చేతికి అందిన నివేదిక మేరకు అభ్యర్థులను మార్చే ప్రక్రియ వేగవంతం చేశారని ప్రత్యామ్నాయంగా కొందరు అభ్యర్థులకు నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని పరోక్షంగా సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

తూర్పున ముగ్గురు.. పశ్చిమాన ముగ్గురు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా వారిలో ఆరుగురికి టికెట్లు దక్కడం అనుమానంగానే ఉంది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో గడిచిన ఐదేళ్లలో చేసిన భూకబ్జాలు, కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఉద్యోగులను వేధించడం, పార్టీ నేతలు, కార్యకర్తలను పట్టించుకోకపోవడం, నియోజకవర్గాల్లో ఒంటెద్దు పోకడ వంటి అంశాలతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా నియోజకవర్గానికి నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరించిన వారికి టికెట్ ఇవ్వకూడదని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి తూర్పున ముగ్గురు పశ్చిమ జిల్లాలో ముగ్గురికి టికెట్లు తగ్గే అవకాశాలు లేవని తెలుస్తోంది. అధికార పార్టీలో కొనసాగుతూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలతో టచ్ లోకి వెళ్లిన ఒకరిద్దరు ఎమ్మెల్యేల సమాచారం కూడా సీఎం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా ఆరుగురు సిట్టింగులకు టికెట్ దక్కడం అనుమానంగా ఉంది. తూర్పు జిల్లాలో ఇద్దరు రిజర్వుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మరొక జనరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేకు టికెట్ కట్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అధిష్టానం వద్ద తనకు బలమైన పలుకుబడి ఉందని చెప్పుకునే ఓ నేత కూడా టికెట్ అయ్యే జాబితాలో ఉన్నట్లు సమాచారం. జిల్లాకు సంబంధించి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరితోపాటు ప్రజా విశ్వాసం కోల్పోయిన మరొకరికి టికెట్ దక్కదని చెబుతున్నారు. పైకి జిల్లాకు సంబంధించిన సిట్టింగులు అందరూ టికెట్ తమకే అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ పరోక్షంగా అధిష్టానం వారికి సంకేతాలు ఇచ్చిందని కూడా చెబుతున్నారు.

కొందరికి గ్రీన్ సిగ్నల్..

గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ టికెట్లు భారీ ఎత్తున అవుతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొందరు ప్రత్యామ్నాయ అభ్యర్థులకు నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోవాలని అధిష్టానం సూచించినట్లు ప్రచారం మొదలైంది. ఉమ్మడి జిల్లా మొత్తంలో ఇద్దరు కొత్త అభ్యర్థులకు నేరుగానే ప్రచారం చేసుకునేందుకు అధిష్టానం అవకాశం ఇచ్చిందని చెబుతున్నారు. త్వరలోనే మరికొందరు అభ్యర్థులను తెరపైకి తెచ్చి ఎన్నికల సమయం నాటికి నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు తెలిసింది.

పక్క చూపులు చూసిన వారు..

కాగా వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం దక్కకపోవచ్చని అనుమానంతో కొంతకాలంగా ఇతర పార్టీల వైపు చూస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేల సమాచారం అధిష్టానం వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. తూర్పున ఒక రిజర్వుడు నియోజకవర్గ ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నాడని అధిష్టానానికి సమాచారం అందింది. కాని నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నేతకు టికెట్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ సమాచారం తోనే ఆ నేత గతంలో ఉన్న సంబంధాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నాడని గుర్తించిన అధిష్టానం ఆయనకు టికెట్ కట్ చేస్తుందని తెలుస్తోంది. పశ్చిమ జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో మాట్లాడినట్లు ఇంటలిజెన్స్ ద్వారా అధిష్టానానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పక్క చూపులు చూస్తున్న ఎమ్మెల్యేలకు అధిష్టానం టికెట్ నిరాకరిస్తోందని అధికార పార్టీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Also Read: సొంత ఇలాకాలో మంత్రి తలసానికి భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత!


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed