- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మరింత వేగం పెంచండి’: మంత్రులు పొంగులేటి- జూపల్లి కృష్ణారావు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మరింత వేగం పెంచాలని మంత్రులు పొంగులేటి- జూపల్లి కృష్ణారావు తెలిపారు.

దిశ, ప్రతినిధి నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మరింత వేగం పెంచాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావులు ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో పాల్గొన్న ఎంపీలు నగేష్, గడ్డం వంశీ, ఎమ్మెల్సీలు దండే విఠల్, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, రామారావు పటేల్, పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్, పాల్వాయి హరీశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు నిర్మాణం సమయంలో ఎప్పటికప్పుడు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయా లేదా, ఇబ్బందులు తలెత్తుతున్నాయా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.
నాణ్యత విషయంలో కూడా రాజీ పడవద్దు..
ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక విషయంలో అటవీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని పలువురు ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అటవీ అధికారులతో మాట్లాడి, ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. లబ్ధిదారులు ఎంత తొందరగా ఇల్లు నిర్మించుకుంటే అంతే తొందరగా కొత్తవారికి మళ్ళీ ఇండ్లు మంజూరు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇండ్ల నిర్మాణాల పనుల నాణ్యత విషయంలో కూడా రాజీ పడవద్దని, బిల్లుల చెల్లింపు ప్రక్రియ నిరంతరం జరగాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో రెవిన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతమ్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, హరిత, భవేశ్ మిశ్రా, కుమార్ దీపక్, అధికారులు పాల్గొన్నారు.






