- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తగ్గుముఖం పట్టని వానలు.. పత్తి, సోయా రైతులు ఆందోళన
దిశ, బోథ్ : ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పత్తి, సోయా రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో పత్తి పంటను వేసిన

దిశ, బోథ్ : ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పత్తి, సోయా రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో పత్తి పంటను వేసిన రైతులు తెల్ల బంగారం పండుతుందో లేదోననే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు వర్షం పడుతుండటం వల్ల పత్తి ఆకులు ఎర్రబారుతుండటంతో పాటు.. పూత, పత్తి కాయలు రాలిపోతున్నాయి. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితిలో లేదని.. పెట్టుబడి కోసం చేసిన అప్పులు కూడా తీర్చడం భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి దిగుబడి ఎకరానికి 10 నుంచి 15 క్వింటాల వరకు రావాలి. కానీ అధిక వర్షాల ప్రభావంతో నాలుగు నుండి ఐదు క్వింటాల వరకు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉందని.. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాదని రైతులు వాపోతున్నారు.
పంటను ధ్వంసం చేస్తున్న అడవి పందులు
ఒకవైపు భారీ వర్షాల వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంటే.. మరోవైపు అడవి పందులు పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా సోయా పంట వేసిన రైతులు అధిక వర్షాల వల్ల కాయలోని గింజలకు మొలకలు వస్తున్నాయని కాయలు కుళ్ళిపోయి పంట దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉంటుందని వాపోతున్నారు. చేతికి వచ్చిన సోయా పంట కోతకు వచ్చినా కానీ అధిక వర్షాల వల్ల హార్వెస్టింగ్ చేయలేని పరిస్థితి నెలకొందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.
సర్వే చేసి ప్రతిపాదనలు పంపాం : వ్యవసాయ అధికారి రవితేజ
బోథ్ మండలంలో 450 ఎకరాల్లో సోనాల మండలంలో 315 ఎకరాల్లో పత్తి, సోయా నష్టం సంభవించిందని.. వ్యవసాయ అధికారి రవితేజ తెలిపారు. పంట నష్టపోయినటువంటి రైతుల వివరాలను సర్వే చేసి ప్రతిపాదనలు పంపామని వివరించారు.






