- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోసంరక్షణ ముసుగులో అక్రమంగా వసూళ్లు..
ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ పశువుల రవాణాను అడ్డుకట్ట వేస్తామనే ముసుగులో కొంతమంది అక్రమ వసూళ్లకు పాల్పడడం కొన్నాళ్లుగా సాగుతోంది.

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ పశువుల రవాణాను అడ్డుకట్ట వేస్తామనే ముసుగులో కొంతమంది అక్రమ వసూళ్లకు పాల్పడడం కొన్నాళ్లుగా సాగుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ఈ అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా జోరుగా సాగుతోంది. నిజానికి గోసంరక్షణ, పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడమనేది మంచి కార్యమే.. అయితే వీటి కోసం కొన్ని సంఘాలు సేవలు చేయడం కొంతయితే.. మరి కొందరు ప్రైవేటు వ్యక్తులు వసూళ్లకు పాల్పడటం సిగ్గుచేటు.. మరోవైపు పశువుల అక్రమ రవాణాలో పోలీసుల పాత్రపై కూడా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఇటీవలే కాలంలో పశువుల అక్రమ రవాణా అడ్డుకునే క్రమంలో కొంతమంది వసూళ్లకు పాల్పడ్డారన్న అభియోగాలతో పోలీసులు ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే జిల్లాకు కొద్ది నెలల క్రితమే ఎస్పీగా వచ్చిన అఖిల్ మహాజన్ ఇలాంటి అక్రమ దందాలపై డేగ కన్నువేసి పట్టుకుంటున్న నేపథ్యంలో కొంతమంది సైలెంట్ అయిపోయారు. మిగిలిన వారు ఇలా పట్టుబడుతున్నారు. కాగా ఇటీవలే అక్రమ పశువుల రవాణా కేసులో నిందితుడిగా ఉండి పోలీసులకు చిక్కని ఓ వ్యక్తి..ఈ వ్యవహారంలో తమను బలిచేస్తున్నారని..పశువుల అక్రమ రవాణాలో ఎక్కడిక్కడే స్వయాన పోలీసులే వసూళ్లకు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేయడం స్థానికంగా చర్చనీయాంశం అవుతుంది.
అడ్డుకట్ట పేరిట..
జిల్లాలో కొంతమంది వ్యక్తులు అక్రమ పశువుల రవాణాకు అడ్డుకట్ట వేస్తామని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.గోసంరక్షణ సంగతి దేవుడెరుగు.. వసూళ్లు చేపట్టడమే వారి వృత్తిగా మార్చుకున్నారు. వీరు జాతీయ రహదారి,మహారాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద.. దర్జాగా తామే అధికారులం అన్నట్లుగా వ్యవహరిస్తూ పశువుల అక్రమ రవాణా చేసే వాహనాలను ఆపుతూ వసూళ్లు చేస్తున్నారు. అందుకు సమ్మతించనీ వారి వాహనాలను నేరుగా బలవంతంగా గోశాలలకు తరలిస్తున్నారు.అప్పుడప్పుడు వీరు పోలీసులకు కూడా సమాచారం ఇస్తూ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.జిల్లాలో ఇలా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు రాజకీయ బడా నేతల అండ చూసుకుని ఈ అక్రమ దందాని తమ వృత్తిగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
పోలీసుల పాత్రపై అనుమానాలు..?
పశువుల అక్రమ రవాణా అడ్డుకట్టవేస్తామనే ముసుగులో ఇటు ప్రైవేటు వ్యక్తులు వసూళ్లకు పాల్పడటం ఒక ఎత్తయితే.. అక్కడక్కడ పోలీసులు కూడా ఈ వ్యవహారంలో అందినకాడికి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.ఇటీవలే పశువుల అక్రమ రవాణా వ్యవహారంలో అరెస్ట్ అయిన వారిలో కొందరు..గతంలో పోలీస్ వాహనాల ప్రైవేట్ డ్రైవర్లే కావడం చర్చనీయాంశంగా మారింది.తాత్కలికంగా పోలీస్ డ్రైవర్లుగా పనిచేస్తున్న వీరు ఎవరి ప్రోత్భలంతో ఇలా వసూళ్లకు పాల్పడ్డారనేది తెలియాల్సి ఉంది.. ఈ తతంగంపై పోలీసు ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించినట్లు సమాచారం..ఈ మొత్తం వ్యవహారం పరిశీలిస్తే పశువుల అక్రమ రవాణానే ఒక నేరం అయితే.. దీన్ని అడ్డుకునే ముసుగులో ప్రైవేట్ వ్యక్తులు బ్లాక్ మెయిలింగ్ చేయడం మరో నేరం..ఇక మరింత ఘోరమైన విషయం ఏమిటంటే కొంటుంది పోలీసులు కూడా ఇందులో వాటా ఉన్నదన్న ఆరోపణలు ఉండటంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్న అనుమానంలో సామాన్యులు ఉన్నారు.
వసూళ్లకు పాల్పడిన ఘటనలు..
* ఇటీవలే పశువుల అక్రమ రవాణా కేసులో 11 మందిపై నేరడిగొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా.. ఐదుగురిని పోలీసుల అరెస్టు చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు.
* గత నెలలో ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షిద్ నగర్ నగర్ కాలనీ సమీపంలో పశువుల వ్యాపారిని అడ్డుకొని డబ్బులు వసూలు చేసిన ఇద్దరిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.
* మే నెలలో నేరడిగొండలో ఓ వ్యక్తి సామాజిక సేవ పేరుతో ఓ పశువుల వ్యాపారిని బెదిరించి, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన ఘటనలో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
* గత మార్చి నెలలో మావలలో ఓ పశువుల యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన యువకుడిపై కేసు నమోదు కాగా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు : అఖిల్ మహాజన్, ఎస్పీ ఆదిలాబాద్
ప్రైవేటు వ్యక్తులకు హైవేలపై వాహనాలను ఆపే అధికారం లేదు.పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నాం..పశువుల అక్రమ రవాణా కేసుల్లో న్యాయ పరమైన విచారణ చేస్తున్నాం..ఈ అక్రమ దందాలో ఎవరున్నా వదిలిపెట్టం.ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు.ఇప్పటికే పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నాం.చట్టం తన పని తాను చేస్తోంది.ఈ కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటాం.






