- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త పెన్షన్లపై ఆశలు..
ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పెన్షన్లపై జోరుగా ప్రచారం సాగుతుండటంతో ప్రజల్లో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి.

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పెన్షన్లపై జోరుగా ప్రచారం సాగుతుండటంతో ప్రజల్లో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి.వృద్ధాప్య, వితంతు,వికలాంగ,ఒంటరి మహిళల పెన్షన్ల కోసం జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.గ్రామ పంచాయతీలు,మండల కార్యాలయాలు,మీ సేవ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ప్రజలు క్యూల్లో నిలబడుతూ కనిపిస్తున్నారు.గత కొన్నేళ్లుగా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న పలువురు ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా అవకాశం ఇస్తుందనే ఆశతో దరఖాస్తులు సమర్పించేందుకు పరుగులు పెడుతున్నారు.ఒకవైపు ప్రజలు కొత్త పెన్షన్ల కోసం మీ సేవ కేంద్రాల్లో అప్లై చేసుకుంటూ ఆశగా ఎదురుచూస్తుండగా.. మరోవైపు అధికారులు మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ లేదా స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదని చెబుతున్నారు. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు, మహిళలు,వికలాంగులు అవసరమైన పత్రాలు తీసుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా.. కొన్ని చోట్ల రద్దీ కారణంగా గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అర్హుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తామని అధికారులు చెబుతుండగా.. ఎవరికి అవకాశం దక్కుతుందన్న అంశం ఇప్పుడు గ్రామస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
మీ సేవ కేంద్రాల్లో పుల్ రష్..
కొత్త పెన్షన్ల దరఖాస్తుల ప్రచారం మొదలైనప్పటి నుంచి జిల్లాలోని మీ సేవ కేంద్రాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామున నుంచే ప్రజలు ఆధార్ కార్డులు,రేషన్ కార్డులు,ఆదాయ ధ్రువపత్రాలు,వైద్య పత్రాలతో కేంద్రాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నట్లు తెలుస్తోంది.మండల కేంద్రాలతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కూడా ప్రజలు సమాచారం కోసం ఆరా తీస్తున్నారు. కొన్నిచోట్ల సర్వర్లు స్లోగా పనిచేయడంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.అయినప్పటికీ కొత్త పెన్షన్ వస్తుందనే ఆశతో ప్రజలు ఉత్సాహంగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు.
జిల్లాలో భారీగా దరఖాస్తులు..
ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్, అర్బన్, భీంపూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, బోథ్, నార్నూర్, జైనథ్, తలమడుగు తదితర మండలాల్లో పెన్షన్ల కోసం ఎక్కువ స్పందన కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్‌ల కోసం మహిళలు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. వికలాంగుల నుంచి కూడా భారీగా అప్లికేషన్లు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.కొన్ని గ్రామాల్లో అర్హుల జాబితాపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని సమాచారం.
అధికారిక ప్రకటన లేక..
ఒకవైపు కొత్త పెన్షన్ల కోసం ప్రజలు భారీగా దరఖాస్తులు సమర్పిస్తుండగా.. మరోవైపు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ లేదా స్పష్టమైన మార్గదర్శకాలు రాకపోవడంతో జిల్లాలో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి.కొత్త పెన్షన్లు నిజంగానే మంజూరు అవుతాయా..? ప్రస్తుతం తీసుకుంటున్న దరఖాస్తుల పరిస్థితి ఏంటి..? గతంలో అప్లై చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందా..? ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లకు ముందుగా అవకాశం ఇస్తారా..? అనే అనేక ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.గ్రామ పంచాయతీలు,మండల కార్యాలయాలు,మీ సేవ కేంద్రాల వద్ద ప్రజలు అధికారులను వివరణ కోరుతున్నప్పటికీ స్పష్టమైన సమాచారం అందకపోవడంతో మరింత అయోమయం నెలకొంది. కొత్త పెన్షన్ వస్తుందనే ఆశతో అవసరమైన పత్రాలు సేకరించి తిరుగుతుండగా..అధికారిక ప్రకటన లేకపోవడం వారిలో ఆందోళన పెంచుతోంది.
ఇంకా స్పష్టత లేదు..
డీఆర్‌డీఏ పీడీ రవీందర్
ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కొత్త పెన్షన్లపై అధికారికంగా ఎటువంటి నోటిఫికేషన్ లేదా స్పష్టమైన మార్గదర్శకాలు అందలేదు. గతంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్లు ఇప్పటికే పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి.అదేవిధంగా ప్రతి వారం ప్రజావాణిలో కూడా కొత్త దరఖాస్తులు వస్తున్నాయి.ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చిన తర్వాతే తదుపరి ప్రక్రియపై స్పష్టత వస్తుంది.






