రైతులకు అష్టకష్టాలు.. జిల్లాలో భారీగా ధాన్యం రాశులు

by Disha Web Desk 12 |
రైతులకు అష్టకష్టాలు.. జిల్లాలో భారీగా ధాన్యం రాశులు
X

దిశ ప్రతినిధి, నిర్మల్: వరి ధాన్యం తరలింపులో జరుగుతున్న జాప్యం అన్నదాతకు శాపంగా మారుతోంది. రోజు సాయంత్రం ఆకాశం మేఘావృతమై తే చాలు రైతు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈదురు గాలులు భయపెడుతున్నాయి. ధాన్యం తరలించే విషయంలో లారీలను సమకూర్చాల్సిన అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పలుకుబడి ఉన్న ప్రజా ప్రతినిధులు తమ గ్రామాలకు లారీలను బలవంతంగా తీసుకు వెళుతుండడంతో కొన్ని గ్రామాలకు అసలు లారీలే పంపడం లేదు.

మరోవైపు లారీల కొరత కారణంగా వరి ధాన్యం కల్లాల వద్ద గొడవలు సైతం జరుగుతున్నాయి. కొన్ని గ్రామాలకు లారీలు అరకొరగా వెళుతున్నాయన్న సమాచారంతో అక్కడికి పంపే ప్రయత్నం చేస్తుండగా దారి మధ్యలో కొన్ని గ్రామాల రైతులు లారీలను అటకాయించి ఇతర గ్రామాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్న సమాచారం ఉంది. దీంతో ధాన్యం భారీగా పండించిన మారుమూల గ్రామాలకు లారీలు వెళ్లకపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి

ధాన్యం తరలింపులో కీలకమైన లారీలను సమకూర్చే విషయంలో అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా లారీల కొరత తీవ్రంగా ఉంది. అయితే కొన్ని ప్రాంతాలకు మాత్రం ఎక్కువగా లారీలను తరలిస్తుండగా మరికొన్ని గ్రామాలకు అసలు లారీలు వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్ మంచిర్యాల జిల్లాల్లో భారీగా వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లోనూ కొంతమేర వరి దిగుబడి ఉంది. నిర్మల్ జిల్లాలో 1,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాల్సి ఉండగా ఇప్పటిదాకా సగం కూడా పూర్తి కాలేదు. నిర్మల్ జిల్లాలో 223 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటిదాకా 198 మాత్రమే ప్రారంభించారు.

ధాన్యం కొనుగోలు సైతం ఇప్పటిదాకా 65 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి రైతాంగానికి సర్కారు భరోసా ఇచ్చేలా కనిపించడం లేదు. మంచిర్యాల జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. మరో 10 రోజులు దాటితే వర్షాకాలం ప్రారంభం అవుతుంది. వాతావరణ ప్రతికూలతలను బట్టి అడపాదడపా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతులు తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల ధాన్యం తడిసి పోయి ఎందుకు పనికి రాకుండా పోయిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. సకాలంలో ధాన్యం తరలిస్తే రైతులకు ఇబ్బంది ఉండదు. కానీ అధికార యంత్రాంగం ధాన్యం తరలింపుకు సంబంధించి లారీలను సమకూర్చడంలో విఫలం అవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. లారీల కొరత రైతాంగాన్ని తీవ్రంగా వేధిస్తోంది.

కృత్రిమ కొరతకు యత్నాలు

వరి ధాన్యం తరలింపునకు సంబంధించి లారీలు సకాలంలో అందుబాటులోకి రావడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుంటున్న లారీల యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో రైతులు లారీల యజమానులకు అదనంగా డబ్బులు సమకూర్చి ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. పరోక్షంగా ఇది రైతులపై అదనపు భారమే. అధికార యంత్రాంగం అత్యంత కీలకంగా వ్యవహరించాల్సిన ఈ సమయంలో లారీల కొరతను అధిగమించడం లేదు.

బ్రతిమిలాడుతున్న రైతులు

మా గ్రామానికి లారీలు పంపండి మహాప్రభో అంటూ రైతులు యజమానుల కాళ్ళ వెళ్ళా పడుతున్నారు. వర్షాలు పడితే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్న రైతులు ఆర్థికంగా కొంత నష్టపోయిన సరే లారీల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వడ్ల కల్లాలు, రోడ్లపై ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయి సకాలంలో తరలించేందుకు లారీలు కనిపించకపోతే రైతాంగం ఆందోళన చెందుతోంది లారీ కనిపిస్తే చాలు... వరం దొరికినట్టుగా రైతులు సంతోషపడుతున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. అధికార యంత్రాంగం స్పందించి ధాన్యం తరలింపుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


Next Story

Most Viewed