రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి : ఎమ్మెల్యే

by Batti.Sumithra |

లోకేశ్వరం మండలంలో వరి ధాన్యం చేతికి వచ్చి ఇప్పటికే నెల రోజులు గడిచాయి.

రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి : ఎమ్మెల్యే
X

దిశ, లోకేశ్వరం: లోకేశ్వరం మండలంలో వరి ధాన్యం చేతికి వచ్చి ఇప్పటికే నెల రోజులు గడిచాయి. వాతావరణంలో మార్పుల వల్ల ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు ధాన్యం రాశుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. రెండు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభించకపోతే జాతీయ రహదారిని రైతులతో కలిసి దిగ్బంధిస్తామని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జిల్లా పౌరసరఫరాల అధికారిని ఫోన్‌లో హెచ్చరించారు. సోమవారం లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్, కనకాపూర్, వాస్తాపూర్ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన తర్వాత 10 నుండి 15 రోజుల వరకు ధాన్యం తూకం వేయడం లేదని, ఎన్ని రోజుల్లో కొనుగోళ్లు చేపడతారో స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే జిల్లా పౌరసరఫరాల అధికారిని ఈ విషయమై ప్రశ్నించారు. రెండు లేదా మూడు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభించకపోతే రైతులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

అలాగే జిల్లాలోని అన్ని మండలాల కంటే ముందుగా రైతులు లోకేశ్వరం మండలంలో వరి కోతలు చేపడతారని, ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ధాన్యపు రాశులతో నిండిపోయాయని తెలిపారు. 15 రోజుల ముందుగానే కొనుగోళ్లు ప్రారంభిస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అలాగే హమాలీల కొరత, ధాన్యం తరలింపుకు లారీల సమస్య ఉండదని ఆయన జిల్లా పౌరసరఫరాల అధికారికి సూచించారు. అబ్దుల్లాపూర్‌లో ఇప్పటికే కొనుగోలు కేంద్రంలో 150 మందికి పైగా రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధంగా ఉంచారని తెలిపారు. వచ్చే వానాకాలం సీజన్‌లో ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఈ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు దడిగే జయలలిత-భోజన్న, డా. సునీల్ కుమార్, దయానంద్, ఆత్మ చైర్మన్ గన్ను నర్సారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి గిరిరాజ్, నాయకులు మెండే శ్రీధర్, మహేందర్ రెడ్డి, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story