ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో మనమే టాప్: సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |

దేశంలో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీనే అగ్రస్థానంలో ఉందని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో మనమే టాప్: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీనే అగ్రస్థానంలో ఉందని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం విశాఖపట్నంలో పర్యటిస్తున్న ఆయన.. సీ ఫుడ్ ఎగుమతులపై నిర్వహించిన జాతీయస్థాయి వర్క్ షాపును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశే అగ్రస్థానంలో ఉందన్నారు. దేశాల వారిగా చూస్తే.. చైనా, నార్వే, ఈక్వెడార్, వియత్నాం, చిలీ దేశాలు ముందంజలో ఉన్నాయని వివరించారు. రాష్ట్రం నుంచి ఆక్వా ఉత్పత్తుల్ని మరింత పెంచేందుకు కేంద్రం అండగా నిలబడాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. రొయ్యల ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్రం అన్నివిధాలా అనుకూలంగా ఉందన్నారు. విశాఖపట్నం, భీమవరం, కాకినాడ, నెల్లూరు, కృష్ణపట్నం ప్రాంతాలు ఆక్వా ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయని తెలిపారు.

రైతులు పొలాల్లో తీసిన కుంటలు సైతం సంపదను సృష్టిస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎగుమతులు పెరిగితే స్థిరమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామన్నారు. పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రం ఎప్పుడూ వెల్కమ్ చెప్తుందని, ఎవరైనా ఎప్పుడైనా తనను కలవచ్చునని, ఫోన్ చేసి కూడా రావొచ్చన్నారు. ఆక్వా రంగంలో కాలుష్యం పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లలో పెనుమార్పులు వస్తున్నాయని, వాటిదృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉద్యోగులు సైకిళ్లపై వెళ్లాలని కోరారు. కేంద్రం కూడా అనేక పర్యావరణహిత పథకాలు తీసుకొచ్చిందని సీఎం చంద్రబాబు వివరించారు.

Next Story