ప్రభుత్వ భూమి కబ్జా.. అక్రమంగా దాబా ఏర్పాటు.. జిల్లాలో రూ.కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతం

by Ramesh Naini |

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి.

ప్రభుత్వ భూమి కబ్జా.. అక్రమంగా దాబా ఏర్పాటు.. జిల్లాలో రూ.కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతం
X

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. అయినా సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. వాంకిడి మండలంలోని గోయగాం పరిధిలోని బీడీపీపీ ప్రభుత్వ భూమిలో అక్రమ కబ్జా చోటుచేసుకుంది. గతంలో ఆర్టీఏ చెక్ పోస్ట్ కోసం రైతుల నుంచి రెండు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి బదులుగా మిగిలిన భూమికి పట్టా చేసి ఇస్తామని అధికారులు రైతులకు హామీ ఇచ్చినా ఆ హామీ నెరవేరలేదు. ఆర్టీఏ చెక్ పోస్ట్ నిర్మాణం నిలిచిపోయి, ఆ స్థలం ఖాళీగా ఉండడంతో ఓ స్థానిక వ్యక్తి దానిని కబ్జా చేసి హోటల్‌ను ఏర్పాటు చేశాడు. నేషనల్ హైవేకు అనుకుని ఉన్న ఈ భూమికి మార్కెట్‌లో ఎకరాకు రూ.50లక్షల నుంచి రూ.60 లక్షల వరకు డిమాండ్ ఉంది. ప్రభుత్వం ఆర్టీఏ చెక్ పోస్ట్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో తమ భూమిని తమకు తిరిగి ఇవ్వాలని లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. చిన్న రేకుల షెడ్డు వేస్తేనే తొలగించే అధికారులు, అక్రమంగా దాబా ఏర్పాటు చేసినా మామూళ్ల మత్తులో పడి కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, ఆసిఫాబాద్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. అయినా సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో చిన్నపాటి రేకుల షెడ్డు వేసినా తొలగించే రెవెన్యూ అధికారులు. వాంకిడి మండలంలోని గోయగాంలో సాగుచేసే బీడీపీపీ ప్రభుత్వం భూములో ఎలాంటి అనుమతులు లేకుండా రెండు ఎకరాలు అక్రమంగా కబ్జా చేసి దర్జాగా దాబా ఏర్పాటు చేశారు. రెండేళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులు మామూళ్ల మత్తులో పడి అక్రమార్కులతో కుమ్మక్కై వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ భూమి నేషనల్ హైవేకు అనుకుని ఉండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎకరాకు రూ.50లక్షల నుంచి రూ.60 లక్షల పైనే ఉంటుందని స్థానికుల అంచనా వేస్తున్నారు.

అక్రమంగా కబ్జా...

వాంకిడి మండలంలోని గోయగాం గ్రామ పంచాయతీ పరిధిలోని మహాగాం గ్రామానికి చెందిన షేక్ నూర్, షేక్ జమీర్ వారి తాత ముత్తాతల నుంచి సర్వేనెంబర్ 62/,107/లోని 7 ఎకరాలు బీడీపీపీ ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్నారు. అయితే 2023లో ఆర్టీఏ చెక్ పోస్ట్ ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులు షేక్ నూర్, షేక్ జమీర్ నుంచి చేరొక ఎకరం చొప్పున రెండు ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇచ్చిన భూమికి బదులుగా మిగిలిన భూమికి పట్టా చేసి ఇస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చినట్లు బాధిత రైతు తెలిపారు. అదే సమయంలో నేషనల్ హైవే రోడ్డు పనులు నిర్వహించారు. ఇందులో కొంత మేరకు భూమి పోగా మిగిలినా రెండు ఎకరాల భూమిని అక్కడి ఓ స్థానిక వ్యక్తి అక్రమంగా కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా దాబా ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఏ చెక్ పోస్ట్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో బాధిత రైతు తన భూమి తనకు తిరిగి ఇవ్వాలని, లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాడు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు..

ఆర్టీఏ చెక్ పోస్ట్ నిర్మాణం కోసం సదరు రైతు నుంచి రెవెన్యూ అధికారులు భూమి స్వాధీనం చేసుకుని రెండేళ్లు గడుస్తున్నా ఆ స్థలంలో అధికారులు ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. ఖాళీగా ఉండటంతో కబ్జాకు గురైంది. తాజాగా ఆర్టీఏ చెక్ పోస్ట్ ఎత్తివేయడంతో చెక్ పోస్ట్ నిర్మించే అవకాశం లేకపోవడంతో తమ భూమి తమకు తిరిగి ఇవ్వాలని స్థానిక తహశీల్దార్‌తో పాటు ఆర్డీవోలను కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదని వాపోతున్నారు. ఫిర్యాదు చేసిన ప్రతిసారీ రేపు ముంపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు.

విచారణ చేపట్టాం.. : తహశీల్దార్ కవిత

ఈ విషయమై తహశీల్దార్ కవితను వివరణ కోరగా ఆ భూమిని ఆర్టీఏ అధికారులు అప్పగించామని తెలిపారు. రైతు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.

మా భూమి తిరిగి ఇవ్వాలి

ఆర్టీఏ చెక్ పోస్ట్ నిర్మాణం కోసమని మా అన్న, నాన్న రెండు ఎకరాలు భూమి ఇచ్చారు. దానికి బదులుగా మాకు పట్టాలు చేసి ఇస్తామన్నారు. కానీ ఎటువంటి పట్టాలు చేయలేదు. అలాగే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ప్రస్తుతం ఆ భూమి కబ్జాలో ఉంది. రెవెన్యూ, ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. తమ భూమి తమకు తిరిగి ఇవ్వాలి, లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.

- షేక్ అష్ఫాక్, బాధితుడు

Next Story