వెంటాడుతున్న గ్యాస్ కష్టాలు.. యాప్‌లు మొరాయింపు.. సిలిండర్ల కొరత

by Malleboina Mahesh |

ఉమ్మడి ఆదిలాబాద్‌లో గ్యాస్ కష్టాలు! యాప్‌లు మొరాయించడంతో బుకింగ్‌లు నిలిచిపోయాయి. గ్యాస్ దొరకక చిన్న హోటళ్లు మూత.. జనం ఆందోళన.

వెంటాడుతున్న గ్యాస్ కష్టాలు.. యాప్‌లు మొరాయింపు.. సిలిండర్ల కొరత
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ కష్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. అసలు గ్యాస్ సమస్య లేదంటున్న అధికార యంత్రంగానికి అసలు విషయం కనిపించడం లేదు. నిన్నటిదాకా అలవాటు పడిన భిన్న రకాల గ్యాస్ వినియోగదారులు... ప్రస్తుత మార్కెట్లో గ్యాస్ లభ్యత తగ్గడంతో ఆందోళనకు గురవుతున్నారు. డొమెస్టిక్ సిలిండర్లు వాడుతూ ఇంతకాలం కమర్షియల్ వ్యాపారం చేసిన హోటల్లు, కిచెన్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఫంక్షన్ హాల్స్... ఇలా విచ్చలవిడిగా గ్యాస్ వినియోగం పెద్ద మొత్తంలో సాగిన నేపథ్యంలో... తాజాగా నెలకొన్న పరిణామాలు ఇబ్బందికరంగా మారిపోయాయి. ఇప్పటికే చిన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు గ్యాస్ దొరకక మూతపడ్డాయి. మరోవైపు మిడిల్ క్లాస్ హోటల్స్ సైతం మూతపడే దిశగా వెళుతున్నాయి. మరో వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటే మార్కెట్లో హోటల్స్ టిఫిన్ సెంటర్ లు కచ్చితంగా మూతపడతాయని వ్యాపారులు చెబుతున్నారు.

గ్యాస్ కంపెనీల యాప్స్..

ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్ పి గ్యాస్.. తదితర కంపెనీల గ్యాస్ బుకింగ్ పడిపోయాయి. భిన్న రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ గ్యాస్ బుకింగ్ జరగడం లేదు. గతంలో కంపెనీల టోల్ ఫ్రీ నంబర్లు చూసి కష్టమర్లు కాల్ చేస్తే నిర్ణీత గడువులోగా గ్యాస్ బండలు ఇంటికి చేరేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తారు మారయింది. యాప్స్ లో గ్యాస్ బుకింగ్ అసలు జరగడం లేదు. భిన్న రకాల మెసేజ్ లు వస్తున్నాయి. కస్టమర్ చేస్తున్న బుకింగ్ తప్పుగా ఉందని... నాలుగు గంటల తర్వాత మీకు మెసేజ్ వస్తుందని... మీ బుకింగ్ 25 రోజుల తర్వాత మాత్రమే చేయాలని... మెసేజ్ లు వస్తున్నాయి. దీంతో గ్యాస్ అయిపోతున్న చివరి రోజుల్లో కస్టమర్లు తీవ్ర ఆందోళన చేస్తున్నారు.

కంపెనీల నుంచి టైట్ జరుగుతున్నదా...

తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే వివిధ ప్రభుత్వ రంగ గ్యాస్ కంపెనీలు టైట్ చేస్తున్నట్లు అర్థం అవుతుంది. పక్షం రోజుల నుంచి ఈ పరిస్థితి మరింత ఎక్కువైంది. యాప్స్ ద్వారా దరఖాస్తు చేస్తుంటే భిన్న రకాల సమాచారం వస్తుంది. అనేక రకాల మెసేజ్ లు వస్తుండడంతో అసలు గ్యాస్ లభ్యత భవిష్యత్తులో ఉంటుందా అన్న భయం వినియోగదారుల్లో వ్యక్తం అవుతుంది. అక్రమ వినియోగం చేసే వినియోగదారులను పక్కన పెడితే... నిజాయితీగా డొమెస్టిక్ సిలిండర్లు వాడే కుటుంబాలకు సైతం తాజా మెసేజ్లు కలవరపెడుతున్నాయి. టోల్ ఫ్రీ నెంబర్లు కొందరికి కలవక పోతుండగా... మరికొందరికి నెగ్లెక్ట్ మెసేజ్ లు వస్తున్నాయి. నాలుగు గంటల తర్వాత కన్ఫామ్ చేస్తామని మెసేజ్ వస్తున్నప్పటికీ ఆ నాలుగు గంటలు గడిచిన తర్వాత కూడా కనీస సమాచారం రావడం లేదు. దీంతో ఏం జరుగుతుందో తెలియక వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు.

Next Story