- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ బాబాల దందా.. మంత్రాలు, తంత్రాల పేరుతో అమాయకులకు టోపీ
పేద మధ్య తరగతి వర్గాల బలహీనతలు వారి పెట్టుబడి.. కొన్ని సందర్భాల్లో విద్యావంతులు,ఉద్యోగులు కూడా వారి వలలో పడిపోతారు. మనిషి అన్నాక ఏదో ఒక అసంతృప్తి ఉండే ఉంటుంది.వాటినే ఆసరాగా చేసుకునే.. దాన్నే ఒక వృత్తిగా ఎంచుకున్నారు.ఎంత అందితే అంత దోచేయడమే

దిశ, ఆదిలాబాద్: పేద మధ్య తరగతి వర్గాల బలహీనతలు వారి పెట్టుబడి.. కొన్ని సందర్భాల్లో విద్యావంతులు,ఉద్యోగులు కూడా వారి వలలో పడిపోతారు. మనిషి అన్నాక ఏదో ఒక అసంతృప్తి ఉండే ఉంటుంది.వాటినే ఆసరాగా చేసుకునే.. దాన్నే ఒక వృత్తిగా ఎంచుకున్నారు.ఎంత అందితే అంత దోచేయడమే కాదు..అనైతిక పనులు కూడా చేస్తున్నారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులకు చిక్కిన నకిలీ బాబాల బాగోతం..
ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ బాబాలు బయటకొస్తున్నారు. ప్రజల నమ్మకాలను సొమ్ము చేసుకుంటూ.. గల్లీకో నకిలీ బాబా పుట్టుకొస్తున్నాడు.ప్రజల అమాయకత్వమో.. లేక వాళ్ల అతి తెలివో గానీ.. మొత్తానికి మోసపోయేది మాత్రం ఆ అమాయక ప్రజలే.. అయితే.. ఇలాంటి ఫేక్ బాబాల ఘటనలు ఎన్ని వెలుగు చూసినా..జనాలు మాత్రం ఎవరినో ఒకరిని నమ్మటం.. వాళ్లకు తెలియకుండానే మోసపోతూనే ఉన్నారు. అయితే.. అలాంటి జనాల నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు పూటకో బాబా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు..ఇలాంటి బాధితుల పిర్యాదుతో పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజల నమ్మకమే ఆదాయంగా..
జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న అమాయక ఆదివాసి పేద ప్రజలతో సహా పట్టణాల్లో కూడా ఉన్న ప్రజల నమ్మకాన్ని ఆదాయంగా మలుచుకున్న కొంతమంది దొంగ బాబాలు.. వారికి మంత్రాలు,తంత్రాల పేరుతో తాయిత్తులు కడుతూ రోగాలు నయం చేస్తామంటూ..ప్రజలను నిండా దోచేస్తున్నారు.అమాయక ప్రజలు ఇది గమనించక వారి వద్దకే వెళుతూ మోసపోతున్నారు.దీంతో వారి అనారోగ్యం నయంకాక మరింత పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతూ చివరకు మృత్యువాత పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయినా సరే ప్రజల్లో ఈ మూఢ నమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.ఒక వైపు పోలీసులు,జనవిజ్ఞాన వేదిక లాంటి సంస్థలు మూఢ నమ్మకాల గురించి ఎంతగా అవగాహన కల్పిస్తున్నా మళ్ళీ ఏదొ ఒక చోట ఇలాంటి పునరావృతం అవుతూనే ఉన్నాయి.
పూజల పేరుతో పాడు పనులు..
జిల్లాలోని మరికొంత మంది నకిలీ బాబాలు పూజల పేరుతో లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. అనారోగ్యం, ఆర్థికపరమైన సమస్యలకు అమాయకులను నమ్మబలుకుతూ.. ఇంట్లో మహిళలను,బాలికలను ఒంటరిగా గదుల్లోకి తీసుకెళ్లి పూజలు చేసి నయం చేస్తామని పాడు పనులు చేస్తున్నారు.మరికొంత మంది బాబాలు గుప్త నిధులు వేటలో.. అమాయకులకు ఆశ చూపుతూ బల్లిచ్చే ప్రయత్నాలు గతంలో చేసిన సంఘటనలు కూడా లేకపోలేదు.ఇంకొంత మంది ఇంట్లో ఉన్న బంగారాన్ని పూజలు చేసి పదింతలు చేస్తామని నమ్మించి
దోచుకుని ఉడాయిస్తున్నారు.అయినా సరే ఉద్యోగులు,విద్యావంతులు వీరి భారిన పడుతుండటం గమనార్హం..
ఇప్పటికైనా ప్రజలు నకిలీ బాబాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పలువురు బాబాలపై కేసులు..
* తాజాగా ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికకు ఆరోగ్యం నయం చేస్తానని ఓ బాబా పూజల పేరుతో వారి ఇంట్లోనే ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో బాబాను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు.
* గత నెలలో బోథ్ మండలంలో నాటు వైద్యం పేరిట మోకాలు నొప్పులు నయం చేస్తానని..నడుము గాయపరిచిన ఘటనలో..పోలీసులు ఐదుగురుపై కేసు నమోదు కాగా ఆ నకిలీ బాబాను జైలుకు పంపారు.
* జులై నెలలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ దొంగ బాబా తన ముఠాతో కలిసి.. నకిలీ ఆయుర్వేదిక్ వైద్యం పేరుతో ఆదిలాబాద్ పట్టణంలో పలువురు అమాయక ప్రజలకు అనారోగ్యం నయమవుతుందని లక్షల్లో దండుకున్నారు. కాగా ఈ కేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
* జూన్ నెలలో ఇచ్చోడ మండలంలో ఓ బాబా మంత్రాలు తంత్రాలు తాయత్తులతో అమాయక ఆదివాసీలకు తాయత్తుల కడుతూ రోగాలు ఏం చేస్తానని వరి ఢీ కొట్టిస్తున్న సందర్భంలో పోలీసులు నిందితుని అరెస్టు చేశారు.
* మే నెలలో ఆదిలాబాద్ పట్టణంలో క్షుద్ర పూజల పేరుతో ఓ బాబా మహిళపై అసభ్యంగా ప్రవర్తించడంతో కేసు నమోదు కాగా..పోలీసులు అరెస్టు చేశారు.
మాయలు,మంత్రాలు లేవు..
* నూతుల రవీందర్,జనవిజ్ఞాన వేధిక రాష్ట్ర కార్యదర్శి ..
ప్రజలు మాయలు,మంత్రాలు నమ్మొద్దు.అనారోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించవచ్చు..అతీత అశక్తులనున్నాయని చెప్పే బాబాలను నమ్మి మోసపోవద్దు.ప్రతి మనిషి సాధారణ వ్యక్తులే.. ఎవరికి అతీత శక్తులనేవి లేవు..ప్రతీది సైన్స్ తో కూడుకున్నదే..
బాబాలను నమ్మి మోసపోవద్దు..
* డీఎస్పీ జీవన్ రెడ్డి..
ప్రజలు ఎలాంటి బాబాలను నమ్మొద్దు.నాటు వైద్యం ద్వారా వ్యాధులు నయం చేస్తానంటే నమ్మవద్దు.. ప్రజలు అనారోగ్యమైతే మంచి గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులను సంప్రదించి సరైన వైద్య చికిత్సలు తీసుకోవాలి.మంత్రాలు,తంత్రాలు నాటు వైద్యం పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుంది.బాధితులు ధైర్యంగా పోలీసులను సంప్రదించవచ్చు..






