నిధుల మళ్లింపు.. పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన కలెక్టర్

by Kodari Anjali |

ఉపాధి హామీ నిధుల చెల్లింపుల విషయంలో అక్రమాలకు పాల్పడ్డ పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ కె.హరిత సస్పెండ్ చేశారు.

నిధుల మళ్లింపు.. పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన కలెక్టర్
X

దిశ, కాగజ్‌నగర్: ఉపాధి హామీ నిధుల చెల్లింపులో అసలైన వారికి కాకుండా ఇతరులకు తరలించి అక్రమాలకు పాల్పడి, విధుల పట్ల నిర్లక్ష్యం వహించాడు కొమరం భీమ్ జిల్లా చింతలమానెపల్లి మండలం గంగాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్‌. కాగా తాజాగా అతడిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కె.హరిత శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్ల బిల్లుల చెల్లింపులో అక్రమాలు జరిగినట్లు కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించిన కలెక్టర్, అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. పనులు చేసిన అసలైన లబ్ధిదారులకు కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిధులను ఇతర వ్యక్తుల ఖాతాలకు మళ్లించినట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలని, బాధ్యతారహితంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులు, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు.

Next Story