- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ కార్పొరేషన్.. మంచిర్యాల పీఠంపై హస్తం గురి
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక కార్పొరేషన్ కావడంతో, ఇక్కడ గెలుపును పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక కార్పొరేషన్ కావడంతో, ఇక్కడ గెలుపును పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రంగంలోకి దిగి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 60 వార్డులతో విస్తరించిన ఈ కార్పొరేషన్‌లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. కార్పొరేషన్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ఈ ఎన్నికలు ఒక అగ్నిపరీక్షగా మారాయి. మేయర్ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించడంతో ఆశావహుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. టికెట్ల కేటాయింపులో ప్రజాదరణే ప్రామాణికమని మంత్రి స్పష్టం చేయడంతో అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా మారింది. గ్రూపు రాజకీయాలకు తావులేకుండా సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
- దిశ ప్రతినిధి, నిర్మల్
దిశ ప్రతినిధి, నిర్మల్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ అయిన మంచిర్యాలపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం మంచిర్యాలలో పర్యటించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్పొరేషన్‌ను కచ్చితంగా పార్టీ ఖాతాలో వేసుకోవాలన్న లక్ష్యంతో గెలిచే వారికే టిక్కెట్లు ఇవ్వాలని స్పష్టం చేశారు.
కార్పొరేషన్ ముఖచిత్రం...
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 వార్డులను ఖరారు చేశారు. ఇందులో రిజర్వేషన్ల వారీగా ఎస్టీలకు 01, ఎస్సీలకు 09, బీసీలకు 20, జనరల్ కేటగిరీకి 30 సీట్లను కేటాయించారు. అత్యంత కీలకమైన మేయర్ స్థానాన్ని బీసీ జనరల్‌కు ఖరారు చేశారు. ఈ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 1,81,778మంది ఓటర్లు ఉండగా, వారి కోసం 265 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఎమ్మెల్యే పీఎస్ఆర్‌కు ప్రతిష్టాత్మక సవాల్
మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చడంలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు (పీఎస్ఆర్) కీలక పాత్ర పోషించారు. తొలిసారిగా జరుగుతున్న ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించడం ఆయనకు ప్రతిష్టాత్మక సవాల్‌గా మారింది. దీంతో ఆయన గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా, ఓట్ల చీలిక రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ అభ్యర్థుల ఎంపికలో ప్రజాదరణే ప్రామాణికమని, తిరుగుబాటు అభ్యర్థులు లేకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక నాయకత్వానిదేనని దిశానిర్దేశం చేశారు.






