- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ : కలెక్టర్ రాజర్శి షా
దిశ, ఆదిలాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో

దిశ, ఆదిలాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు. పోలింగ్ బూతులు, సిబ్బంది నియామకం, భద్రతా చర్యలు, బ్యాలెట్ పత్రాలు, ఇతర పోలింగ్ సామాగ్రి పంపిణీ వరకు ప్రతి అంశం మండలవారీగా సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలపై అధికారులు, సిబ్బందికి ఇప్పటికే స్పష్టమైన సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించేందుకు జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు శాఖతో సమన్వయం పెంచి సమగ్ర భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని, ఎలాంటి ఉల్లంఘనలు గమనించినా వెంటనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి..
ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చోడ మండలాల్లోని 166 గ్రామ పంచాయతీలకు సంబంధించిన మొదటి విడత ఎన్నికల కోసం 1408 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 20 శాతం రిజర్వులతో కలిపి మొత్తం 1478 మంది పీఓలు, 1729 మంది ఎపీఓలను నియమించినట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 4,49,981 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారని, అందులో పురుషులు 2,19,652, మహిళలు 2,30,313, ఇతరులు 16 మంది ఉన్నారని వివరించారు. ఎన్నికల సమయంలో ఎఫ్‌ఎస్‌టీలూ, ఎస్‌ఎస్‌టీలూ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయని చెప్పారు. ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని, శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీలేదని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, ఆర్డీఓ స్రవంతి, డీపీఓ రమేష్, డీపీఆర్వో విష్ణువర్ధన్ పాల్గొన్నారు.






