- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇసుక దోపిడీదారులపై కలెక్టర్ రుద్రరూపం.. మూడు ట్రాక్టర్లు సీజ్
కొమురం భీం జిల్లాలో అనుమతిలేని ఇసుక దందాలకు చెక్ పెట్టేందుకు జిల్లా కలెక్టర్ కె. హరిత స్వయంగా రంగంలోకి దిగారు.

దిశ, కాగజ్ నగర్: కొమురం భీం జిల్లాలో అనుమతిలేని ఇసుక దందాలకు చెక్ పెట్టేందుకు జిల్లా కలెక్టర్ కె. హరిత స్వయంగా రంగంలోకి దిగారు. నదీ గర్భాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కుల పాలిట సింహ స్వప్నంలా విరుచుకుపడ్డారు. బుధవారం రెబ్బెన మండలం రాంపూర్ శివారులో కలెక్టర్ జరిపిన మెరుపు తనిఖీలో జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించింది. కాగజ్ నగర్ పెద్దవాగును అడ్డాగా చేసుకుని ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను కలెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాంపూర్ గ్రామం సమీపంలో వాగు నుండి ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఆమె స్వయంగా అడ్డుకున్నారు. అధికారుల కళ్లు గప్పి ఇసుకను తరలించవచ్చన్న ధీమాతో ఉన్న అక్రమార్కులకు కలెక్టర్ ఊహించని షాక్ ఇచ్చారు. ట్రాక్టర్లను పరిశీలించిన సమయంలో కనీసం అనుమతి పత్రాలు కూడా లేకపోవడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే ఆ వాహనాలను సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కార్యాలయాల్లో కూర్చోవడం మాత్రమే కాదు..
ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి పర్యావరణాన్ని నాశనం చేసే ఇసుక మాఫియాను ఉపేక్షించే ప్రసక్తే లేదు, అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలపై పీడీ యాక్ట్ తరహాలో కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోం అని జిల్లాలోని ప్రతి వాగుపై నిఘా ఉంచాం.. ఇకపై తనిఖీలు మరింత ఉధృతం చేస్తాం అని తెలిపారు. కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి దిగి నిఘా పెట్టడంతో జిల్లాలోని ఇసుక మాఫియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కార్యాలయాల్లో కూర్చోవడం మాత్రమే కాదు, అక్రమాలను అరికట్టేందుకు రోడ్ల పైకి వస్తామని ఆమె చేతల్లో చూపించడం, అధికారుల అండదండలతో సాగుతున్నాయో లేదా గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నాయో అన్న తేడా లేకుండా, అక్రమం కనిపిస్తే వేటు తప్పదని ఆమె తేల్చి చెప్పారు. ప్రభుత్వ సంపదను కాపాడటంలో కలెక్టర్ చూపిన ఈ దూకుడుపై సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఇసుక అసురుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందో లేదో చూడాలి.






