పుట్ట‌గొడుగుల్లా వెలిసిన క్లినిక్ లు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-12-15 09:25:59  IST  )

దిశ, బోథ్ : గ్రామీణ ప్రాంతాలలో అర్హత లేని ఆర్ఎంపీల వైద్యం సరైన అర్హతలు లేకుండా

పుట్ట‌గొడుగుల్లా వెలిసిన క్లినిక్ లు
X

దిశ, బోథ్ : గ్రామీణ ప్రాంతాలలో అర్హత లేని ఆర్ఎంపీల వైద్యం సరైన అర్హతలు లేకుండా వైద్యం అందిస్తే ప్రజల ప్రాణాలకే ముప్పు. పల్లెల్లో ఆర్ఎంపీలే వైద్యం అందిస్తున్నారు. ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని నిబంధనలు చెబుతున్నా.. చాలా చోట్ల చికిత్స అందిస్తుండడం గమనార్హం. ఇంత జరుగుతున్నా జిల్లా వైద్య శాఖ నామ మాత్రం చర్యలకే పరిమితం అయ్యిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అర్హతలేని క్లినిక్ లకు అడ్డుకట్ట వేసేది ఎవరనేది ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది.? పేద, మధ్యతరగతి ప్రజలే టార్గెట్ గా పెట్టుకున్న ఆర్ఎంపి, పీఎంపీల ఆట కట్టించేది ఎవరనేది అందరినీ ఆలోచనలు పడేస్తోంది. బోథ్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో చలామణి అవుతున్న ఆర్ఎంపి, పీఎంపీ లపై.. దిశ, ప్రత్యేక కథనం..

ఇష్టానుసారంగా క్లినిక్ ల నిర్వహణ :

గ్రామాల్లోకి కొంతమంది ఆర్ఎంపీ, పీఎంపీల ముసుగులో ఉదయమే బైకుల పై వచ్చి అనారోగ్యం బారిన పడుతున్న అమాయక ప్రజలకు అర్వత లేని వైద్యం చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎటువంటి వ్యాధికైనా వైద్యం చేస్తూ డబ్బు సంపాదనే ధ్యేయంగా గ్రామీణ ప్రాంతాల్లో చెలామణి అవుతున్నారు. వైద్యం చేస్తున్న ఇలాంటి వారు అధికారులకు కనపడడం లేదా లేక మామూళ్ల మత్తులో జోగుతున్నారా అనే అనుమానాలు పలువురిలో రేకెత్తిస్తున్నాయి.ప్రథమ చికిత్స చేయాల్సిన ఆర్ఎంపి లు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ఎక్కడపడితే అక్కడ ఇష్టా రాజ్యాంగ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నారు. అనుమతులు లేకుండా క్లినిక్ లకు ఎలాంటి పేరు పెట్టకూడదు అనే నిబంధనలను తుంగలో తోక్కుతూ ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారు. క్లినిక్ లోనే బెడ్లు వేసి సెలైన్లు ఎక్కించడం, ఇంజక్షన్ లు వేయడం చేస్తున్నారు.దీనితో పాటు రోగి అవసరాన్ని ఆసరాగా చేసుకొని అడ్డంగా దోచుకుంటున్నారు.

ప్రైవేట్ ఆసుపత్రులతో చేతులు కలిపి..

నియోజకవర్గంలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో అవతార మెత్తిన ఆర్ఎంపీలు పలు జిల్లా కేంద్రాలలోని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు అని పలువురు అంటున్నారు. వారితో కాని వైద్యాన్ని ప్రైవేటు ఆసుపత్రికి రిఫర్ చేస్తూ కమిషన్లు దండుకుంటున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామీణ ఆర్ఎంపీలు కొందరు నెలకు 5 నుంచి 10 కేసుల చొప్పున ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తున్నారు. ఇంత జరుగుతున్న గ్రామీణ ప్రాంతాల్లో అర్హత లేని వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ క్లినిక్ లపై జిల్లా వైద్యశాఖ ఇప్పటి వరకు దృష్టి సారించకపోవడంపై అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నియోజకవర్గంలో ఉండే మెడికల్ ఆఫీసర్లు కనీసం తనిఖీలు కూడా చేపట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అర్హత లేని ఆర్ఎంపీల వైద్యానికి నిరుపేద ప్రజలు తమ జేబులు గుల్ల చేసుకోవాల్సిందేనా లేక ఆర్ఎంపీల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తారా వేచి చూడాల్సిందే. ఆర్.ఎం.పి, పిఎంపీల విషయమై జిల్లా వైద్యాధికారి రాథోడ్ నరేందర్ ను వివరణ కోరగా ఆర్ఎంపీ, పి.ఎం.పి లు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని యాంటీ బయోటిక్స్, స్టేరాయిడ్ లు ఇవ్వడానికి అర్హులు కాదని, అలాంటి వారు ఎవరైనా ఉంటే విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story