- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిప్రి గడ్డ పై.. సీఎం గర్జన
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామంలో ఏప్రిల్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దిశ ప్రతినిధి, నిర్మల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల 'ప్రజాపాలన' ఉత్సవాలలో భాగంగా... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బలమైన పునాది వేసిన 'పీపుల్స్ మార్చ్' పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామంలో ఏప్రిల్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు.
శనివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర ఉన్నత అధికారులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. "ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం తాను సీఎల్పీ నేత హోదాలో చేపట్టిన 'పీపుల్స్ మార్చ్' పాదయాత్ర పిప్పిరి గ్రామం నుంచే ప్రారంభమైందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాట ఇస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని తప్పకుండా నెరవేరుస్తుందన్నారు. అందుకే ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా, పాదయాత్ర సమయంలో కొన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పత్రాలను అందజేస్తామని స్పష్టం చేశారు. సీఎం టూర్ ఇలా..
ఏప్రిల్ 6న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి బాసరకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్నం 2 గంటలకు పిప్పిరి గ్రామానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. " రాష్ట్రంలో '99 రోజుల ప్రజాపాలన ఉత్సవాలు' సమర్థవంతంగా సాగుతున్నాయని, ఇందులో భాగంగానే గ్రామసభల నిర్వహణతో పాటు, ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభను పిప్పిరిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
ఇదిలా ఉంటే...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారులు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి లు మాట్లాడుతూ ప్రజా పాలన 99 రోజుల ఉత్సవాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆనాటి సీఎల్పీ నేత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిప్పిరి గ్రామం నుంచి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 6న నిర్వహించే ఈ భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి హాజరవుతున్న బహిరంగ సభకు అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు.
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చట్టబద్ధంగా ఉన్న వాటిని పరిష్కరించాలని, సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా వారికి మంజూరు పత్రాలను అందించే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, వెడమ బొజ్జు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గౌరవ ఉప్పల్, ఎడ్యుకేషన్ సెక్రెటరీ యోగితారాణా, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా కలెక్టర్ హరిత, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిప్యూటీ సీఎం సెక్రెటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.






