- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివేక్ 'దూకుడు'కు చెక్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో, ముఖ్యంగా తూర్పు జిల్లాల్లో కొత్త సమీకరణలు తెరపైకి వచ్చాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కేబినెట్ హోదా కలిగిన సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో, ముఖ్యంగా తూర్పు జిల్లాల్లో కొత్త సమీకరణలు తెరపైకి వచ్చాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కేబినెట్ హోదా కలిగిన సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. అయితే ఈ నియామకం ద్వారా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దూకుడుకు రాజకీయంగా చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు విశ్లేషణ. మంత్రి పదవి దక్కక అసంతృప్తితో ఉన్న ప్రేమ్ సాగర్ రావుకు ఈ పదవి ద్వారా ఉమ్మడి జిల్లాపై బలమైన పట్టు సాధించే అవకాశం లభించింది. ఆయన బాధ్యతలు చేపడితే, తూర్పు జిల్లా కాంగ్రెస్‌లో రెండు పవర్ పాయింట్స్ ఏర్పడి, ఆయన హవా పెరుగుతుందని చర్చ నడుస్తోంది. అధికార యంత్రాంగాన్ని గైడ్ చేసే అవకాశం ఉండడంతోపాటు ఆయన అనుచర గణం బలోపేతం అవుతుందని అంచనా. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న ప్రేమ్ సాగర్ రావు తిరిగి వచ్చిన తర్వాత జరిగే రాజకీయ పరిణామాలపై ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ పరిణామం రాబోయే రోజుల్లో జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది.
దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం వివేక్ వెంకటస్వామికి రాజకీయంగా చెక్ పెడుతున్నారా..? అంటే రాజకీయ కోణంలో చూస్తే అదేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. త్వరలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ముఖ్యంగా తూర్పు జిల్లాలో అనేక సమీకరణలు మారుతాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. అందుకు ఆయనకు బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కకావికలం అయిన సందర్భంలో ఉమ్మడి జిల్లాకు ఆయన పెద్దదిక్కుగా నిలిచారు. ఇది కాదనలేని వాస్తవం కూడా. అయితే రాజకీయ సమీకరణలు సామాజిక కూర్పులో ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. ఇటీవల ఆయన కాస్త అనారోగ్యానికి గురై తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజాగా క్యాబినెట్ హోదాతో కలకలం..
ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు క్యాబినెట్ హోదా ఉన్న రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో కలకలం మొదలైంది. ప్రేమ్ సాగర్ రావు వర్గీయుల్లో ఒకవైపు హర్షం వ్యక్తం అవుతుండగా... ఆయన మాత్రం ఆ పదవి తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం కూడా మొదలైంది. తనకు మంత్రి పదవి కచ్చితంగా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఆయనను ఒప్పించి కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు తీసుకునేలా కార్యచరణ చేస్తున్నట్లు కూడా తెలిసింది. మొన్నటిదాకా ఎమ్మెల్యే హోదాలో మాత్రమే కొనసాగుతూ వస్తున్న ప్రేమ్ సాగర్ రావు తాజాగా కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు చేపడితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై బలమైన పట్టు సాధించే అవకాశాలు ఉన్నాయి. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లతోపాటు అధికార యంత్రాంగాన్ని ఆయన గైడ్ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా తూర్పు జిల్లాకు సంబంధించి మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలపై ఆయన గట్టి పట్టు సాధిస్తారని అంటున్నారు. అదే జరిగితే తూర్పు జిల్లా కాంగ్రెస్ పార్టీలో అనేక రాజకీయ సమీకరణలు చోటు చేసుకుంటాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రెండు పవర్ పాయింట్స్..
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే తూర్పు జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో రెండు పవర్ పాయింట్స్ జనరేట్ అవుతాయని భావిస్తున్నారు. తూర్పు జిల్లాతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రేమ్ సాగర్ రావుకు అనుచర గణం ఉంది. కార్పొరేషన్ చైర్మన్ పదవి కేబినెట్ హోదాను కలిగి ఉన్న నేపథ్యంలో ఆ బలాన్ని ఆయన చాటుకునే క్రమంలో గతంలో ఆయనతో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు బలోపేతం అవుతాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రేమ్ సాగర్ రావు హవా పెరుగుతుందని, మంత్రి వివేక్‌కు చెక్ పెట్టే అవకాశం ఉందని కూడా పార్టీలో చర్చ జరుగుతున్నది. అయితే అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రేమ్ సాగర్ రావు తిరిగి వచ్చిన తర్వాత జరిగే రాజకీయ పరిణామాలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.






