కబ్జాకు గురవుతోన్న వరద కాల్వ.. పట్టించుకునే వారే కరువు

by Dishanational2 |
కబ్జాకు గురవుతోన్న వరద కాల్వ.. పట్టించుకునే వారే కరువు
X

దిశ, లక్షెట్టిపేట: లక్షెట్టిపేటలో జలవనరులు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే చెరువు శిఖం భూములను ఆక్రమిస్తూ సొమ్ము చేసుకుంటున్న రియల్ వ్యాపారులు వరద కాల్వలను వదలడం లేదు. కాల్వ గట్లు ధ్వంసం చేసి తమ వెంచర్లకు రోడ్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుని కాల్వల ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. రోడ్ల సౌకర్యంతో తమ ప్లాట్లకు డిమాండ్ సృష్టించుకుని లక్షల రూపాయలు అక్రమార్జన చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ ఆక్రమణ..

మున్సిపాలిటీ పరిధిలో గంపల పల్లి చెరువుకు ఉన్న రెండు వరద కాల్వలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. చెరువు మత్తడి నుంచి బొట్ల కుంట, ఇటిక్యాల చెరువుల వరకు వరద కాల్వలు ఉన్నాయి. ఆక్రమణదారుల, రియల్ వ్యాపారుల పుణ్యమాని ఈ కాల్వలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. గంపలపల్లి చెరువు మత్తడి నుంచి బొట్ల కుంట చెరువు వరకు సుమారు కిలోమీటరున్నర దూరం పొడవు మేర ఉన్న వరద కాల్వ ను ఆక్రమణదారులు మెల్ల మెల్లగా ఆక్రమించి ఇల్లు నిర్మించు కుంటున్నారు. కొందరు రియల్ వ్యాపారులైతే కాల్వ గట్లను ధ్వంసం చేసి రోడ్లు వేసి తమ ప్లాట్లకు లక్షల రూపాయల్లో డిమాండ్ పెంచుకుని అక్రమార్జన చేస్తున్నారు. ఈ వరద కాల్వ ధ్వంసం అవుతుండటంతో సాగునీరు బొట్ల కుంట చెరువు లోకి వరద వెళ్ళలేక ఆ చెరువు చెత్తాచెదారం, జంతు వ్యర్థాలు చేస్తుండడంతో మురికి కుంటగా మారింది. దీని కింద ఆయకట్టు సాగు లేకుండా పోయింది. బొట్ల కుంట వరద కాల్వ అక్రమ గురవుతున్నదని, దానిపై అక్రమ నిర్మాణాలను తొలగించి మనుగడను కాపాడాలని స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు సైతం చేశారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కానరావడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గంపల పల్లి చెరువు మత్తడి నుంచి ఇటిక్యాల చెరువు వరకు ఉన్న మరో వరద కాల్వది ఇదే పరిస్థితి. ఈ వరద కాల్వ ను ఆనుకొని ఉన్న భూములకు ఎకరాన కోట్ల రూపాయల ధర అ పలుకుతోంది. గుంటకు రూ. 3 లక్షల నుంచి 5 లక్షలకు పైగా ధర పలుకుతుండడంతో కాల్వను వదలడం లేదు. కాల్వ ఆక్రమిస్తూ మురికి కాల్వ సైజు‌లో మారుస్తున్నారు. ఈ ఆక్రమణ‌లతో వర్షాకాలంలో వరద కిందికి వెళ్లే మార్గం లేక గట్లు తెగిపోయి సమీపంలో ఉన్న ఊత్కూర్ చౌరస్తాలోని 63 వ. నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు చేరి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తోంది. దీనికితోడు రోడ్డుకి నష్టం వాటిల్లుతోంది.

రిపోర్టు రాగానే చర్యలు చేపడతాం: ఆకుల వెంకటేష్ మున్సిపల్ కమిషనర్, లక్షెట్టిపేట




వరద కాల్వల ఆక్రమణలపై రెండు ఫిర్యాదులు మాకు వచ్చాయి. దీనిఫై ఇరిగేషన్ శాఖ అధికారులకు లెటర్ రాశాను. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్త సర్వే చేసి, మార్కింగ్ వేసిన రిపోర్టు ఇరిగేషన్ అధికారుల నుంచి మాకు రావాల్సి ఉంది. దాని ఆధారంగా తగు చర్యలు చేపడతాం.

Next Story

Most Viewed