- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంది గోలీలు కొరికిన గేదెలకు తీవ్రగాయాలు
బాదంపల్లి గ్రామసమీపంలో గోదావరి నది ఒడ్డున ఆదివారం ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది.

దిశ, జన్నారం : మండలంలోని బాదంపల్లి గ్రామసమీపంలో గోదావరి నది ఒడ్డున ఆదివారం ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. వన్యప్రాణులను వేటాడేందుకు గుర్తుతెలియని వేటగాళ్లు అమర్చిన పేలుడు పరికరాలను కొరికి మూడు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన పశువుల కాపరులు తమ బర్లను మేత కోసం గోదావరి తీర ప్రాంతానికి తీసుకువెళ్లగా, మేత కోసం తిరుగుతున్న బర్లలో కొన్ని మేస్తున్న సమయంలో గ్రామానికి చెందిన శంకరయ్య, నర్సయ్య, రాజన్నలకు చెందిన మూడు గేదెలు అక్కడ ఉన్న పంది గోలీలను తెలియక కొరికాయి. ఆ గోలీలు నోట్లోనే పేలిపోవడంతో గేదెల ముఖభాగం పూర్తిగా నుజ్జునుజ్జై తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించడంతో అక్కడ ఉన్న పశువుల కాపరులు, ఇతర గేదెలు భయంతో చెదరిపోయాయి. గాయపడిన గేదెల పరిస్థితి చూసి కాపరులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ పేలుడు పరికరాలను తినడంతో ఒక్కసారిగా పేలుళ్లు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనలో పలు బర్రెలకు తీవ్రగాయాలు కావడంతో కాపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గాయపడిన పశువులను సమీపంలోని వెటర్నరీ వైద్యుల వద్ద చికిత్సకు తరలించారు. ఈ ఘటనతో గ్రామస్థుల్లో భయం నెలకొంది. వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఇలాంటి ప్రమాదకర పేలుడు పరికరాలు అమర్చడం వల్ల నిరపరాధ పశువులు బలవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అటవీ శాఖ అధికారులు, పోలీసు అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఇదే ప్రాంతంలో మూడు రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. పేలుడు పరికరాలను తినడం వల్ల నాలుగు మేకలు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామ ప్రజల్లో మరింత భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన పై జన్నారం ఎస్ఐ ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






