బ్రీత్ అనలైజర్ టెస్ట్ రచ్చ.. మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన

by Kema Shiva Kumar |

మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట ఉదయం డ్రైవర్లు మెరుపు ఆందోళనకు దిగారు.

బ్రీత్ అనలైజర్ టెస్ట్ రచ్చ.. మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల (Mancherial) ఆర్టీసీ డిపో వద్ద ఇవాళ ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బ్రీత్ అనలైజర్ టెస్టు (Breath Analyzer Test)లో సాంకేతిక లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆర్టీసీ డ్రైవర్లు డిపో ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. దీంతో డిపో నుంచి బస్సులు బయటకు రాకపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ప్రతిరోజూ లాగే డ్యూటీకి వెళ్లే ముందు డ్రైవర్లకు అధికారులు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. అయితే, ఈ పరీక్షలో పలువురు డ్రైవర్లకు రీడింగ్ 56 కంటే ఎక్కువగా చూపించింది. తాము కనీసం మద్యం ముట్టుకోకపోయినా, మెషిన్ ఇలా రీడింగ్ చూపించడంపై డ్రైవర్లు విస్మయం వ్యక్తం చేశారు. మెషిన్‌లో సాంకేతిక లోపం ఉందని, అది తప్పుగా చూపిస్తుందని అధికారులకు మొరపెట్టుకున్నారు.

డిపో ఎదుట బైఠాయింపు..

తమ మాట వినకుండా అధికారులు విధుల్లోకి తీసుకోవడానికి నిరాకరించడంతో డ్రైవర్లు (Drivers) ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపో ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. తాము మద్యం తాగలేదని.. మెషిన్ పాడైపోయిందని.. వెంటనే దాన్ని మార్చాలంటూ నినాదాలు చేశారు. అధికారులు స్పందించి మరో మెషిన్‌తో పరీక్షలు నిర్వహించే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. డ్రైవర్ల ఆందోళనతో మంచిర్యాల డిపో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు లోపలే నిలిచిపోయాయి. బస్సుల కోసం బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు డిపోకు చేరుకుని డ్రైవర్లతో చర్చలు జరుపుతున్నారు. సమస్యను పరిష్కరించి బస్సులను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Next Story