మావోయిస్టుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి

by Kema Shiva Kumar |

మావోయిస్టుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి
X

దిశ, తాండూర్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం మావోయిస్టుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వాంకిడి మండలం ఇందాని గ్రామ శివారులో బుధవారం పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టి ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండాలని సూచించారు. మరో కొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు.

సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను అరికట్టాలన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ల పని తీరును డీఎస్పీ, ఐజీలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలీసు అధికారి, పోలీసు సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. నేరాల నియంత్రణ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో జిల్లా పోలీసుల సేవలు, పని తీరు అభినందనీయమన్నారు.

కమ్యూనిటీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా తిర్యాణి మండలంలోని మారూమూల గ్రామాల గిరిజనులకు సేవ కార్యక్రమాల ద్వారా చేయుతనిస్తున్న స్థానిక ఎస్సై రమేష్ ను ఐజీ అభినందించి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చాహాత్ బాజ్ పాయ్, అదనపు ఎస్పీలు అచ్చేశ్వర రావు, భీం రావు, డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Next Story