లిక్కర్.. లీకేజీ! బార్ల మాటున అక్రమ దందా!

by Ajay Maddhiboyina |

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు ఆబ్కారీ శాఖ నిబంధనలను బేఖాతర్ చేస్తున్నారు. బార్లలోని లిక్కర్ బహిరంగ మార్కెట్లోకి తరలుతుండడంతో వైన్స్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు.

లిక్కర్.. లీకేజీ! బార్ల మాటున అక్రమ దందా!
X

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు ఆబ్కారీ శాఖ నిబంధనలను బేఖాతర్ చేస్తున్నారు. బార్లలోని లిక్కర్ బహిరంగ మార్కెట్లోకి తరలుతుండడంతో వైన్స్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారులు, కొంతమంది వైన్స్ యజమానులతో బార్ యజమానులు సిండికేట్‌గా మారి అక్రమ దందా సాగిస్తున్నారు. క్వార్టర్, హాఫ్ బాటిళ్ల అమ్మకాల వెసులుబాటును బార్ యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. కంప్యూటర్ బిల్లులు ఇవ్వకుండా ఫంక్షన్లకు నేరుగా మద్యం సప్లై చేస్తూ పన్నులు ఎగ్గొడుతున్నారు. ఉదయం 7 నుంచి అర్ధరాత్రి 1గంట వరకు అక్రమంగా కిటికీల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు. ఆబ్కారీ శాఖ అధికారులు ‘మామూళ్లు’ తీసుకుని మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా సరిహద్దులు దాటించి పక్క జిల్లాలకు కూడా బార్ల మద్యం సరఫరా అవుతున్నా పట్టించుకునే వారు లేరు.

- దిశ ప్రతినిధి, నిర్మల్

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు ఆబ్కారీ శాఖ నిబంధనలను బేఖాతర్ చేస్తున్నారు. అధికారుల కనుసన్నల్లోనే అక్రమ ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. గతంలో ఉన్న నిబంధనలను సవరించి క్వార్టర్, హాఫ్ బాటిళ్లు అమ్ముకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడంతో బార్ యజమానులు దీనిని అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకున్నారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ కేంద్రాల నుంచి సరఫరా అయ్యే మద్యం స్టాక్ నేరుగా బార్లకు మాత్రమే వెళ్లాలి, దానిని బార్ పరిధిలోనే అమ్ముకోవాలి. కానీ, ఈ నిబంధనలను తుంగలో తొక్కి బార్ల బయట కూడా యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. రూ.లక్షలు పెట్టి వైన్ షాపులు దక్కించుకున్న వ్యాపారులు, ఈ బార్ల అక్రమ అమ్మకాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

యాజమాన్యాల ఇష్టారాజ్యం...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వరకు బార్ అండ్ రెస్టారెంట్లు నడుస్తున్నాయి. వీటిలో ఎక్కువ భాగం మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలలో ఉన్నాయి. మిగతా బార్లు జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కేంద్రాలలో ఉన్నాయి. తూర్పు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు మంచిర్యాల స్టాక్ పాయింట్ నుంచి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఉట్నూరు స్టాక్ పాయింట్ నుంచి మద్యం సరఫరా అవుతోంది. ఈ స్టాక్ పాయింట్ల నుంచి బార్లకు సరఫరా అయ్యే మద్యం కేవలం బార్ లోపలే విక్రయించాలి. కానీ యజమానులు నిబంధనలకు వ్యతిరేకంగా బార్ బయట విక్రయాలు సాగిస్తున్నారు. ఎవరైనా పెద్ద మొత్తంలో లిక్కర్ కావాలంటే, బార్ యజమానులు నేరుగా వారికి సప్లై చేస్తూ, రికార్డుల్లో మాత్రం బార్ లోపలే అమ్మకాలు జరిగినట్లు చూపిస్తున్నారు. అంతేకాకుండా, కొందరు బార్ యజమానులు నిబంధనలు అతిక్రమించి జిల్లా సరిహద్దులు దాటించి పక్క జిల్లాలకు కూడా మద్యాన్ని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఈ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది.

సిండికేట్‌గా మారిన వ్యాపారులు..

ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలలో వైన్స్ యజమానులు, బార్ యజమానులు సిండికేట్‌గా మారడంతో ఈ అక్రమాలపై కనీస ఫిర్యాదులు కూడా రావడం లేదు. నిర్మల్ జిల్లాలో సైతం వీరు చేతులు కలిపి అక్రమ దందాను సాగిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ లిక్కర్ సిండికేట్ నడుపుతున్న వారి పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ, కొత్తగా మద్యం వ్యాపారంలోకి వచ్చిన వారు ఈ బార్ల యజమానుల అక్రమ అమ్మకాల వల్ల విపరీతంగా నష్టపోతున్నారు.

కంప్యూటర్ బిల్లులు ఎక్కడ..?

బార్లలో లిక్కర్ కొనుగోలు చేసిన వారికి విధిగా కంప్యూటర్ బిల్లులు ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. ఈ నిబంధన పాటించకపోవడం వల్ల అక్రమ అమ్మకాలకు మార్గం సుగమం అవుతోంది. బార్లలో ధరలు ఎక్కువగా ఉంటాయన్న కారణంతో కస్టమర్లు తక్కువగా వెళుతుంటారు. దీంతో యజమానులు లాభాల కోసం అడ్డదారులు తొక్కుతూ బార్లలో అమ్మాల్సిన మద్యాన్ని బహిరంగ మార్కెట్లోకి తరలిస్తున్నారు. ఇది ఎక్సైజ్ అధికారులకు తెలిసినప్పటికీ అసలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తమకు కావాల్సిన ‘మామూళ్లు’ అందితే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగే భారీ ఫంక్షన్లకు నేరుగా బార్ల నుంచి మద్యం సరఫరా అవుతున్నా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేసిన సందర్భాలు అసలు లేనే లేవు. ఇలాంటి ఫంక్షన్లపై దృష్టి పెడితే కచ్చితంగా బార్ల ద్వారా జరుగుతున్న అక్రమాలు వెలుగు చూస్తాయి.

సమయ నిబంధనలు గాలికి..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బార్ల యజమానులు సమయ నిబంధనలను అసలు పాటించడం లేదు. ఉదయం 10గంటలకు తెరవాలన్న నిబంధన ఉన్నప్పటికీ, అక్రమంగా ఉదయం 7గంటల నుండే దొంగ కిటికీలు తెరిచి అమ్మకాలు సాగిస్తున్నారు. అలాగే రాత్రి 11గంటలకు మూసివేయాల్సిన బార్లు, అర్ధరాత్రి 1గంట వరకు ప్రైవేట్ కిటికీల ద్వారా అక్రమ అమ్మకాలు సాగిస్తున్న విషయం బహిరంగ రహస్యం. దీనిపై దృష్టి పెట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేమిటో అధికారులకే తెలియాలి.

Next Story