బాబోయ్ కాపర్ (రాగి) దొంగలు

by Ratna Kumari |

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్లే టార్గెట్ చేస్తూ కాపర్ రాగి వైర్ చోరీలకు పాల్పడుతున్నారు. పంటలకు బోర్ల నుంచి సాగు నీరు అందించేందుకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ల‌కు లక్షల రూపాయలు వెచ్చించి రైతులు విద్యుత్ కనెక్షన్లను పొందుతున్నారు.

బాబోయ్ కాపర్ (రాగి) దొంగలు
X

దిశ, భీమిని : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్లే టార్గెట్ చేస్తూ కాపర్ రాగి వైర్ చోరీలకు పాల్పడుతున్నారు. పంటలకు బోర్ల నుంచి సాగు నీరు అందించేందుకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ల‌కు లక్షల రూపాయలు వెచ్చించి రైతులు విద్యుత్ కనెక్షన్లను పొందుతున్నారు. మార్కెట్లో కాపర్ (రాగి) తీగకు మంచి డిమాండ్ ఉండడంతో ట్రాన్స్ ఫార్మ‌ర్ల‌ అపరిచిత వ్యక్తులు లక్ష్యంగా పెట్టుకొని కాపర్ వైర్ దొంగతనాలకు తెరలేపడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల జిల్లా భీమిని మండలం వాడాల గ్రామంలో గురువారం అర్ధ రాత్రి విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ ధ్వంసం చేసి కాపర్ వైర్ ను దొంగలించిన ఘటన వెలుగు చూసింది. మండలంలోని వాడాల గ్రామానికి చెందిన సంతోష్ అనే రైతు పంట పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ లోని కాపర్ వైరును దొంగిలించారు. ఉదయం వేళ పంటకు నీరు అందించేందుకు వెళ్లిన రైతు ధ్వంసం చేసి ఉన్న ట్రాన్స్ ఫార్మ‌ర్ ని గమనించి ఆశ్చర్యపోయాడు. కాపర్ వైరు దొంగతనానికి పాల్పడినట్టు రైతు గుర్తించాడు. రబీ వరి పంట సాగుకు బోరు నుండి సాగు నీటిని వదిలేందుకు వెళ్లిన రైతు కన్నీటి పర్యంతమయ్యడు. అర్ధరాత్రి విద్యుత్ స్తంభం ట్రాన్స్ ఫార్మ‌ర్ కి బిగించిన వైర్లను చాకచక్యంగా కత్తిరించి కాపర్ వైర్ ను దొంగిలించుకుపోనట్టు రైతు వాపోయాడు. వరి పంట పూత, కాత సమయంలోనే విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ లోని రాగి తీగ ను దొంగలు తీసుకువెళ్లడం ఆ రైతు ఇబ్బంది కలిగించింది. సంబంధిత విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిపాడు.

గతంలో రెండు చోట్ల చోరీ..

మార్కెట్లో కాపర్ వైర్ కు రూ.1500 వరకు ధర పలుకుతుండడంతో చోరీకి కాదేది అనర్హం అన్నట్టు కాపర్ దొంగలు పెట్రేగిపోతున్నారు. మండలం లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ లను ధ్వంసం చేస్తున్నారు. అందులోని విలువైన కాపర్ రాగి వైరను చోరీ చేస్తున్నారు. గత సంవత్సరం మండలంలోని బిట్టురుపల్లి కి చెందిన ఎలుక.బాపు అనే రైతు ట్రాన్స్ ఫార్మ‌ర్ ను ధ్వంసం చేసి కాపర్ వైర్ ను తీసుకెళ్లారు. కేస్లాపూర్ గ్రామంలోని చల్లూరి. శంకరయ్య అనే రైతు పంట చేనులో ట్రాన్స్ ఫార్మ‌ర్ నుంచి కాపర్ వైర్ ను మూడు సార్లు దొంగిలించుకుపోయారు. ఇలాంటి ఘటనలే మళ్లీ చోటు చేసుకోవడంతో వ్యవసాయ రైతులు తీవ్ర ఇబ్బందులకు లోన అవుతున్నారు. అంతేకాకుండా మండల పరిషత్ అభివృద్ధి పక్కన ఉన్న బీఎస్ ఎన్ఎల్ టవర్లకు ఉన్న విలువైన కాపర్ వైర్ ను చోరీ చేయడం అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. మరి కాపర్ వైర్ దొంగల ముఠాను పట్టుకునేది ఎవరనే సందేహాలు మండల ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

Next Story