గురుకుల టీజీ సెట్ కు ఏర్పాట్లు పూర్తి

by Disha Web Desk 1 |
గురుకుల టీజీ సెట్ కు ఏర్పాట్లు పూర్తి
X

ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 23 పరీక్షా కేంద్రాలు

దిశ, బెల్లంపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ, టీఎస్ జనరల్ గురుకులాల్లో ఐదో వతరగతి ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహిస్తున్న టీజీ సెట్ ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఈ సందర్భంగా శనివారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల, కాసిపేట బాలుర గురుకుల టీఎస్ఆర్ ప్రిన్సిపాల్స్ ఐనాల సైదులు, ఊటూరి సంతోష్, భూక్యా శ్రీనివాస్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

బెల్లంపల్లి లో శివంరోడ్ లో గల కాసిపేట బాలుర గురుకులం, ఏ.ఆర్ హెడ్ క్వార్టర్స్ రోడ్డులోని బాలికల గురుకులం, తాళ్ల గురిజాల రోడ్డులో గల బాలుర గురుకుల సీవోఈ, టీఎస్ గురుకులాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో 8 పరీక్షా కేంద్రాల్లో 3,075 మంది, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 8 పరీక్షా కేంద్రాల్లో 2,603 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 7 పరీక్షా కేంద్రాల్లో 2,397మంది పరీక్షకు హాజరవుతారన్నారు. ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 పరీక్షా కేంద్రాల్లో 13,075 ధరఖాస్తులు స్వీకరించినట్లు వారు తెలిపారు.

ఈ ప్రవేశ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యహ్నం 1 వరకు జరుగుతుందన్నారు. విద్యార్ధులు ఒక గంట ముందుగానే కేటాయించిన పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ప్రిన్సిపాల్ సైదులు కోరారు. ఈ ప్రవేశ పరీక్షకు సంబందించిన ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లీష్ లో ఉంటుందన్నారు. 100 మార్కులకు ఇవ్వబడే ఈ ప్రశ్నాపత్రంలో తెలుగు 20 మార్కులు, ఇంగ్లీష్ 25 మార్కులు, మ్యాథ్స్ 25 మార్కులు, ఈవీఎస్ 20 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 10 మార్కులు ఉంటాయన్నారు. 4వ తరగతి వరకు గల సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయన్నారు.

సంక్షేమ గురుకుల సంస్థ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొని రావాలని సూచించారు. విద్యార్ధులు విధిగా బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ చేయడానికి ఉపయోగించాలన్నారు. పరీక్షా కేంద్రాలకు సంబంధించిన ఇతర సందేహాలేమైన ఉంటే హాల్ టికెట్ లో ఇచ్చిన పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటిండెంట్ ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.

Next Story

Most Viewed