- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇసుకపై ఉక్కుపాదం..
అక్రమ ఇసుక రవాణాపై నిర్మల్ జిల్లా కొత్త కలెక్టర్ భవేష్ మిశ్రా ఉక్కుపాదం మోపుతున్నారు.

దిశ ప్రతినిధి, నిర్మల్ : అక్రమ ఇసుక రవాణాపై నిర్మల్ జిల్లా కొత్త కలెక్టర్ భవేష్ మిశ్రా ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ మేరకు నిర్మల్ జిల్లాలో ఉన్న తహసీల్దార్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు సహా పోలీసు యంత్రాంగానికి సైతం కఠిన సంకేతాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్ కొత్త కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ఇది ముఖ్యమైందని అధికార వర్గాలు సైతం భావిస్తున్నాయి. నిర్మల్ జిల్లాను ఆనుకొని ఉన్న గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు జిల్లాలో ఉన్న అనేక వాగులు వంకల నుంచి పెద్ద మొత్తంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. స్థానిక అధికారులు రాజకీయ నాయకుల అండదండలతో ఇసుక రవాణా చేసే అక్రమార్కులు అడ్డగోలుగా దోచుకున్నారన్న ఆరోపణలు పెద్ద మొత్తంలో వ్యక్తమయ్యాయి. ఇప్పటికే జిల్లా ఎస్పీ జానకి షర్మిల కఠినంగా వ్యవహరిస్తుండగా... కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ భవేష్ మిశ్రా సైతం బుధవారం జిల్లాస్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో అక్రమ ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో కొన్నాళ్లుగా అడ్డగోలుగా దోచుకుంటున్న ఇసుక దొంగలకు కళ్లెం పడుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గోదావరి, స్వర్ణ, పలికేరు వాగులు కీలకం...
నిర్మల్ జిల్లాలో పెద్ద మొత్తంలో గోదావరి నదిపై ఆధారపడి సుఖ దొంగలు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. బాసర నుంచి మొదలై కడెం మండలం ముగిసేదాకా గోదావరి పరివాహక ప్రాంతంలో నది నుంచి ఇసుక అనేక చోట్ల ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా చేయడం ఆనవాయితీగా మారింది. ఎండాకాలం ప్రారంభం అయిన నుంచి మళ్లీ వర్షాలు వచ్చేదాకా పరివాహక ప్రాంతంలో పెద్ద మొత్తంలో ట్రాక్టర్ల స్వైర విహారం సాగుతుంది. లక్ష్మణ చందా ,మామడ ఖానాపూర్ కడెం ప్రాంతాల గోదావరి పరివాహక ప్రాంతం నుంచి లారీల ద్వారా కూడా అక్రమ రవాణా చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు నిర్మల్ నియోజకవర్గంలో ఉన్న స్వర్ణ వాగు నుంచి వాగు పరిసర గ్రామాల నుండి గ్రామ అభివృద్ధి కమిటీలకు డబ్బులు చెల్లించి ప్రతి ఏటా పెద్ద మొత్తంలో ఇసుక రవాణా చేస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గం లో ఉన్న పలికేరు వాగు నుంచి , ముధోల్ నియోజకవర్గం లోని సుద్ధ వాగు, కల్లూరు వాగు కూడా అక్రమార్కులకు స్వర్గధామంగా మారింది. తాజాగా ఈ వాగుల నుంచి తరలిస్తున్న అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు.
మహారాష్ట్ర నుంచి సైతం...
ఇదిలా ఉంటే నిర్మల్ జిల్లాను ఆనుకుని ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి సైతం పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా సాగుతున్నది ఒకవైపు మహారాష్ట్రలో ఇసుక తవ్వకాలపై ఆంక్షలు కఠినంగా ఉండగా... పక్కనే ఉన్న నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలకు అక్కడి ఇసుక వ్యాపారం అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసి తరలిస్తున్నారు ఈ రవాణాపై కూడా పోలీసులు రెవెన్యూ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్రలోని ఎజిగి, ధర్మాబాద్ బోకర్ తదితర ప్రాంతాల నుంచి రహస్యంగా తరలించే ఇసుక రవాణాపై కూడా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.






