అర్హులైన జర్నలిస్టులకే అక్రిడిటేషన్లు : కలెక్టర్ రాజర్షిషా

by Ratna Kumari |

జిల్లాలో నిబద్ధతతో పని చేస్తున్న నిజమైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు.

అర్హులైన జర్నలిస్టులకే అక్రిడిటేషన్లు :   కలెక్టర్ రాజర్షిషా
X

దిశ, ఆదిలాబాద్ : జిల్లాలో నిబద్ధతతో పని చేస్తున్న నిజమైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పాటైన జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్‌కు పూల మొక్కను అందించి, మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని, అర్హత గల ప్రతి విలేకరికి కార్డు అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఓ),కమిటీ సభ్యులపై ఉందన్నారు. అక్రిడిటేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోని మార్గదర్శకాలను కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు.

ముఖ్యంగా క్రిమినల్ నేపథ్యం ఉన్న వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కార్డులు జారీ చేయకూడదని ఆయన ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని, త్వరలోనే జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఇ.విష్ణువర్ధన్, కమిటీ సభ్యులు నూకల దేవేందర్, బేత రమేష్, బిర్కుర్వార్ వెంకటేష్, మహమ్మద్ హమీదుల్లా అన్వర్, పి.గజానన్, మెడపట్ల సురేష్, తోట్ల చిన్న అంజయ్య, బి.కిరణ్ కుమార్ జి.వినోద్ కుమార్ పాల్గొన్నారు.

Next Story