- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అదనపు పని వేళలు
రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని నిర్ణయించినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని నిర్ణయించినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చు తగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధిక రద్దీ ఉన్న చంపాపేట, సరూర్‌నగర్, వనస్థలిపురం, గండిపేట్, మహేశ్వరం, ఫరూఖ్‌నగర్, షాద్‌నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, సంగారెడ్డి, ఘట్‌కేసర్, నల్గొండ ఆర్వో, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పని వేళలను 12వ తేదీ నుంచి పొడిగిస్తున్నామన్నారు. ఈ 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో అవసరమైతే మరింత సమయాన్ని పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అదే విధంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్లాట్ బుకింగ్‌ల సంఖ్యను కూడా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇతర ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ల రద్దీ పెరిగిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను గుర్తించి, అవసరానికి అనుగుణంగా అదనపు సమయాన్ని పెంచాలని సూచించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ జరిగే తహశీల్దార్ కార్యాలయాలను కూడా సమన్వయం చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, వేగం, ప్రజలకు సౌకర్యం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పని చేస్తోందని, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతును ఆదేశించారు.






